Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా గోష్టిలో ప్రకాశ్ కరత్
- సొంత బలం పెంచుకోవడంపై దృష్టి
- ప్రాంతీయ పార్టీలు బీజేపీని దూరం పెట్టాలని పిలుపు
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ప్రమాదకరంగా మారిన హిందుత్వ మతతత్వంపై రాజీలేని పోరుచేయడం ద్వారానే దేశాన్ని రక్షించుకోగలమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ అన్నారు. సీపీఐ(ఎం) అఖిలభారత మహాసభలో భాగంగా నాల్గవరోజైన శనివారం రాజకీయ నిర్మాణ నివేదికపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీడియాపాయింట్లో జరిగిన విలేకరుల సమావేశంలో కన్నూరు జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌తో కలిసి పాల్గొన్న ఏచూరి మాట్లాడుతూ పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయడం ద్వారానే మతతత్వాన్ని ఓడించగలమని మహాసభ గుర్తించిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ సొంత బలంపెంచుకోవాలనీ, అదే సమయంలో పార్టీ సభ్యుల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ 'హిందు వేరు... హిందుత్వ వేరు. హిందుత్వను రాజకీయ ఆయుధంగా చేసుకోవాలని సావర్కర్ నిర్దేశించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు అదే చేస్తూ ప్రజలను చీలుస్తున్నాయి. వారిలో విభేదాలు రెచ్చగొట్టడం ద్వారా అధికారంలో కొనసాగుతున్నాయి. అటువంటి హిందుత్వ సిద్ధాంతం దేశానికి ప్రమాదం. దానినే మేం వ్యతిరేకిస్తున్నాం. హిందువులను కాదు' అని వివరించారు. ముస్లిం మతతత్వం ప్రమాదకరంగా మారిన చోట దానిపై కూడా పోరాడుతున్నామని చెప్పారు. గడిచిన నాలుగేండ్ల కాలంలో పార్టీ చేసిన కార్యకలాపాలను నిర్మాణ నివేదికపై చర్చలో భాగంగా సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ కాలంలో రెండు ప్రధాన రాష్ట్రాలలో పార్టీ సభ్యుల సంఖ్య తగ్గిందని, దిద్దుబాటులో భాగంగా మిగిలిన చోట్ల కూడా సభ్యుల సంఖ్య తగ్గిందని చెప్పారు. కేరళ మాత్రం దీనికి మినహాయింపు అని తెలిపారు. సభ్యుల సంఖ్య తగ్గినప్పటికీ ఈ కాలంలో పార్టీ చొరవ పెరిగిందనీ, దేశంలో అత్యంత కీలకమైన రెండు ప్రధాన ఉద్యమాలల్లో పార్టీ శ్రేణులు చురుకైన పాత్ర పోషించాయని చెప్పారు. సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొట్టమొదటిసారి మోడీ ప్రభుత్వ మతతత్వ విధానాలపై ప్రజలు గళం విప్పారని చెప్పారు. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ పోరాటాన్ని కరోనా కారణంగా వాయిదా వేశారని చెప్పారు. రైతాంగ ఉద్యమాన్నీ ఆయన ప్రస్తావించారు. ఇవే కాకుండా, దేశ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ పోరాటాలు, ఆందోళనల్లోనూ పార్టీ జోక్యం పెరుగుతోందని తెలిపారు. దీనిని మరింత ముందుకు తీసుకుపోవాల్సిఉందని చెప్పారు.
పార్టీ ఎన్నికల ఓటములపై...
ఎన్నికల్లో ఓటములపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తమ పార్టీలో గెలుపుకైనా, ఓటమికైనా సమిష్టి బాధ్యత ఉంటుందని చెప్పారు. ఓటమికి ఏ ఒక్కరో కారణమని చెప్పలేమని అది తమ విధానం కాదని అన్నారు. అటువంటి ఫలితాలు వచ్చిన చోట ప్రజల విశ్వాసాన్ని పొందాల్సి ఉందని చెప్పారు. ఆ దిశలో పార్టీ శ్రేణులు దృష్టి సారించాయని తెలిపారు. నాలుగేండ్ల కాలంలో బెంగాల్లో సీపీఐ(ఎం) కార్యకర్తలను తృణమూల్ గుండాలు హత్య చేశారనీ, ఏకపక్షంగా చేసిన దాడుల్లో వేలాది మంది గాయపడ్డారని వివరించారు. త్రిపురలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఆ రెండు రాఫ్ట్రాల్లోనూ నిలదొక్కుకుని ఈ దాడులను తిప్పికొట్టాల్సి ఉందన్నారు.
ఎన్నికల ఎత్తుగడలపై...
ఎన్నికల ఎత్తుగడలను అర్ధం చేసుకోవడంలో అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని ఆ రాష్ట్రాల నాయకత్వ దృష్టికి తీసుకుపోయామని చెప్పారు.