Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భావసారూప్యత పార్టీలకు తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు
- రాష్ట్రాల హక్కులపై దాడిని తిప్పికొట్టాలని విజ్ఞప్తి
- ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్ర సంస్థల ప్రయోగం
- దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకం కావాలి
- మోడీ హయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయని ఆందోళన
- భిన్నత్వంలో ఏకత్వమే మన బలం
- ఐక్యత, సమగ్రతను కాపాడాలి
- కేంద్ర, రాష్ట్ర సంబంధాల సదస్సులో
కేరళ ఎం పినరయి విజయన్
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర సంబంధాలను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్‌పై పోరుకు కలిసిరావాలని భావసారూప్యత పార్టీలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాల హక్కులపై దాడిని తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. మోడీ హయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం కేంద్ర విచారణ సంస్థలను, గవర్నర్లను ప్రయోగించి, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. కేరళలోని కన్నూర్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభ సందర్భంగా శనివారం నాడిక్కడ జవహార్ స్టేడియంలో ''కేంద్ర-రాష్ట్ర సంబంధాలు''పై జరిగిన సదస్సులో తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు ఎంకె స్టాలిన్, పినరయి విజయన్, కాంగ్రెస్ నేత, ప్రొఫెసర్ కెవి థామస్ మాట్లాడారు. ఈ సదస్సుకు సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ అధ్యక్షత వహించారు.
రాష్ట్రాల అధికారాలను కేంద్రం ఆక్రమిస్తోంది : స్టాలిన్
'మన రాజ్యాంగ నిర్మాతలు ఏకీకృత, ఏకశిలా ప్రభుత్వాన్ని సృష్టించలేదు. వారు అధికారాన్ని వినియోగించుకునే కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలుగా విభజించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలి. గ్రామాల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రాల అభివృద్ధితో దేశం అభివృద్ధి చెందుతుంది. దేశంలోని గ్రామాలు, రాష్ట్రాల అధికారాలను నిర్వీర్యం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. కేంద్రం తరచూ రాజ్యాంగం నిర్వచించిన అధికార పరిధిని ఉల్లంఘిస్తోంది' అని విమర్శించారు. 'స్వయం ప్రతిపత్తి లేని స్వపరిపాలన తెల్లపులి (బ్రిటిష్) స్థానంలో భారత పులి(మన పాలకులు)ని పెట్టడం లాంటిదని మహాత్మా గాంధీ అప్పట్లో అన్నారు. అదే ఇప్పుడు వాస్తవం అవుతుంది. అటువంటి స్వాతంత్య్రం దేనికీ విలువైనది కాదని విప్లవకారుడు భగత్ సింగ్ అప్పుడు చెప్పాడు'' అని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.
ప్రజలే ప్రతికారం తీర్చుకుంటారు
'ఢిల్లీలోని మన పాలకులు రాష్ట్రాలను లొంగదీసుకుని తమ ముందు పాకులాడేలా చేయడంలో ఆనందాన్ని పొందుతున్నారంటే అది ప్రజలకు చేసిన ద్రోహం కాదా? ఇది వారి నుంచి ప్రతీకారం తీర్చుకునే చర్య కాదా? రాష్ట్రాల నుంచి ప్రతీకారం తీర్చుకుంటున్నారనే భావనతోనే ప్రజల నుంచి ప్రతీకారం తీర్చుకుంటారు. బీజేపీ అధికారంలోకి రాగానే, రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించి, వాటి ఆర్థిక హక్కులను హరించే జీఎస్టీని అమలు చేసింది. పన్నుల వసూళ్లను కొల్లగొట్టారు. పరిహారం ఇస్తామని హామీ ఇచ్చినా పరిహారం ఇవ్వటం లేదు. అరకొర పరిహారం కూడా సకాలంలో ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయడం లేదు.'' అని ఆరోపించారు. ''దక్షిణాది రాష్ట్రాల్లో రైల్వే పథకాలకు నిధుల కేటాయింపులు వివక్ష, ఏకపక్షానికి మరొక ఉదాహరణ.అలాంటి చర్చలు జరగకుండా చూసేందుకు,రైల్వే బడ్జెట్‌ను రద్దు చేశారు.వ్యవసాయంపై చట్టం చేస్తారు.ఇది రాజ్యాంగం లోని రాష్ట్ర జాబితాలోని అంశం. అయితే కీలకమైన అంశంపై చర్చలు లేకుండా, రాష్ట్రాలతో సంప్రదింపులు చేయకుండానే చట్టాలు చేశారు. పార్లమెంటు ఇప్పుడు ప్రత్యేకమైన, అర్థవంతమైన చర్చలు లేకుండా ఉంది. పార్లమెంట్ సభ్యులు లేవనెత్తిన ఏ ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవు. ఢిల్లీలోని ప్రభుత్వం ఎవరికీ జవాబుదారీతనం లేని విధంగా వ్యవహరిస్తోంది'' అని తమిళనాడు సీఎం విమర్శించారు.
గవర్నర్ ద్వారా రాష్ట్రాన్ని పాలించాలని భావిస్తున్నారు
ప్రతి రాష్ట్రంలో ఎన్నికైన మంత్రివర్గం ఉన్నప్పుడు, గవర్నర్ కార్యాలయం ద్వారా రాష్ట్రాన్ని పాలించాలని కోరడం రాజ్యాంగ విరుద్ధం కాదా? కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పనిచేయగలదా? ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాల్లో రాజ్‌భవన్ ద్వారా సమాంతర ప్రభుత్వాన్ని నడపాలని కోరడం రాజ్యాంగ బద్ధమా?'' అని విమర్శించారు. ''తమిళనాడులో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన శాసనసభ రెండుసార్లు నీట్ బిల్లును ఆమోదించినా రాష్ట్రపతికి పంపకుండా గవర్నర్ కాలయాపన చేస్తున్నారన్నారు. ఆయన రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తున్నారా? నీట్ బిల్లులే కాదు, గవర్నర్ చేతిలో 11 బిల్లులు ఉన్నాయి. నామినేటెడ్ గవర్నర్ అధికారాలు 8 కోట్ల మంది ప్రజల అభీష్టాన్ని అధిగమిస్తాయా?'' అని స్టాలిన్ ప్రశ్నించారు 'ప్రజాస్వామ్యాన్ని శూన్యం చేయాలనే ఉద్దేశంతో అతను హత్యా క్షేత్రాన్ని సృష్టించాడు. రాష్ట్రాన్ని తన తప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయోగాలు చేయడానికి ప్రాక్టీస్ ఫీల్డ్‌గా మార్చాడు'' అని తనను ఇబ్బంది పెడుతున్న ఒక గవర్నర్‌ను ప్రస్తావిస్తూ మహానేత జ్యోతిబసు అన్న మాటలను గుర్తు చేశారు. ''నేను కేరళ ప్రజలకు మంచి చేయడానికి వెళ్ళాను. అందుకే నా ప్రభుత్వం రద్దు చేయబడింది'' అని మహానేత ఇఎంఎస్ నంబూద్రిపాద్ అన్న మాటలను గుర్తు చేశారు.
దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకం కావాలి
''దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకం కావాలి. ఆపై దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సముదాయాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలకు మరిన్ని హక్కులు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలి. ఇది జరగాలంటే రాజకీయాల హద్దులు దాటి ఐక్యంగా కలిసి రావాలి.ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా, భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం, ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలు కలిస్తేనే విజయం సాధ్యమవుతుంది.ఈ విజయమే ఈ దేశానికి, సామాజిక న్యాయం,సమానత్వం,లౌకికవాద ఆదర్శాలకు భరోసానిస్తుం ది.అటువంటి విజయాన్ని సాధించేందుకు ప్రతి పక్షం చర్యలు తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కోసం పోరాడుదాం! నిజమైన సమాఖ్య భారతదేశాన్ని సృష్టిద్దాం!'' అంటూ ముగించారు.
ఐక్యత, సమగ్రతను కాపాడాలి: పినరయి విజయన్
''కమ్యూనిస్టు పార్టీ అన్ని సమయాలలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల సమస్యను తీవ్రంగా తీసుకుంది. భవాని సేన్ రచించిన 'నూతన్ బంగ్లా', పి. సుందరయ్య రచించిన 'విశాల ఆంధ్ర', ఇఎంఎస్ నంబూద్రిపాద్ రచించిన 'ఒన్నెకల్ కోటి మలయాళీలు' జాతీయత ప్రశ్నను ప్రస్తావిస్తూ చేసిన రచనలు. దానితో పాటు, వారు రాష్ట్రాల భాషాపరమైన పునర్వ్యవస్థీకరణ కోసం ప్రజలను ఏకం చేశారు. ఆ రోజుల్లో పార్టీ నిర్వహించిన సైద్ధాంతిక, ఆచరణాత్మక కార్యాచరణ బెంగాల్లో తెభాగ ఉద్యమం, ఆంధ్రాలో తెలంగాణ పోరాటం, కేరళలో పున్నప్రా-వాయలార్ పోరాటం వంటి అనేక ఉద్యమాలు పోరాటాలకు బీజం వేసింది'' అని విజయన్ తెలిపారు. ''రాష్ట్రాలకు హక్కుగా ఉన్న వాటి కోసం పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కేరళ విషయానికి వస్తే, యూడీఎఫ్ ఎంపీలు కేరళ అభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడానికి మొగ్గు చూపడం లేదు. కేంద్రం-రాష్ట్ర సంబంధాలను ప్రజాస్వామ్యీకరించడం చాలా అవసరం. తద్వారా రాష్ట్రాల హక్కులు రక్షించబడతాయి. దేశం ఐక్యత, సమగ్రతను కాపాడేలా చూసుకోవాలి. దీన్ని పరిగణనలోకి తీసుకునే జోక్యాలు ఇప్పుడు దేశానికి అవసరం. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం'' అని వివరించారు.
సమాఖ్య వ్యవస్థ ధ్వంసం: కెవి థామస్
సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేశారని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కెవి థామస్ విమర్శించారు. దేశంలోని రాష్ట్రాల హక్కులు కాలరాయబడుతున్నాయని విమర్శించారు. హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ నేతగా ఇక్కడి రాలేదనీ, మంచి అంశంపై మాట్లాడేందుకు వచ్చానని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం జరిగే పోరాటంలో తాను ఉంటానని స్పష్టం చేశారు.
ముగిసిన చర్చలు
రాజకీయ నిర్మాణ నివేదికపై చర్చలు శనివారం రాత్రి ముగిశాయి. చర్చల్లో 47 మంది పాల్గొన్నారు. తెలంగాణ నుంచి టి.జ్వోతి, పి.సుదర్శన్, ఏపి నుంచి డి.రమాదేవి పాల్గొన్నారు.