Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎం)ను అక్కున చేర్చుకున్న మళయాళీలు
- పిల్లాజెల్లాతో సహా మహాసభ ప్రాంగణం వద్దకు
- నాలుగో రోజుకు అఖిల భారత మహాసభ
- నేడు ముగింపు, బహిరంగ సభ ొ రెడ్‌షర్టు వాలంటీర్ల కవాతు
కన్నూరు (కేరళ) నుంచి బి.వి.యన్.పద్మరాజు
తెలుగు రాష్ట్రాల్లో తిరునాళ్లు, పండగలు, వేడుకలు, పెండిండ్లకు కుటుంబాలకు కుటుంబాలు తరలిరావటం ఆనవాయితీ. ఆయా ఫంక్షన్లు జరిగినన్ని రోజులూ ఎలాంటి అవరోధాలు, ఆటంకాలూ ఎదురు కాకూడదని ఆకాంక్షిస్తూ అవి విజయవంతం కావాలని కోరుకోవటమనేది మనకు సహజసిద్ధమైన అలవాటు. ఆయా వేడుకలకు వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవటం, జయప్రదమయ్యాక అతిథులకు ఘనమైన వీడ్కోలు పలకటం మనకు రివాజు. ఇప్పుడు అచ్చంగా ఇదే తరహాలో కేరళ ప్రజానీకం... ఇక్కడి కన్నూరులో కొనసాగుతున్న సీపీఐ (ఎం) 23వ అఖిల భారత మహాసభకు తండోపతండాలుగా తరలొస్తున్నది. మహాసభ కొనసాగుతున్న ఇకె నయనార్ అకాడమీ వద్దకు నిత్యం వేలాది మంది కుటుంబాలకు కుటుంబాలుగా తరలొస్తున్నారు. వారి రాకతో కన్నూరు నగరంలోని రోడ్లన్నీ దూరేందుకు సందు లేనంతగా కిక్కిరిసిపోతున్నాయి. ఎండ వేడిమిని, తీవ్రమైన ఉక్కపోతను సైతం లెక్కచేయక... చంటి పిల్లల్ని సైతం చంకనేసుకుని మరీ వారు మహాసభ ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ జనంతో నిండిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ రద్దీ ఎక్కువగా ఉంటున్నది. ఈ జనసందోహం ఎంత ఎక్కువగా ఉంటున్నదంటే... మహసభ ప్రాంగణం వద్దకు ప్రతినిధులు, పాత్రికేయులు వెళ్లాలంటే పక్కనే ఉన్న మెయిన్ రోడ్డు నుంచి కనీసం అరగంట సేపు పడుతున్నది. అంతలా జన ప్రవాహం అక్కడకు వచ్చి చేరుతున్నది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉంచిన అంతర్జాతీయ కమ్యూనిస్టు యోధులు, సీపీఐ (ఎం) జాతీయ, రాష్ట్ర నేతల ఫొటోలు, ఫ్లెక్సీల వద్ద పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి సందడిగా గడుపుతున్నారు.
మరో విశేషమేమంటే... ఎర్ర చీరెలు, ఎర్ర చొక్కాలు ధరించి, నెత్తిన కేరళకే ప్రత్యేకమైన టోపీ (హ్యాట్)లతో అక్కడికి వస్తున్న మహిళలు, పురుషులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. చిన్నారులు సైతం చే గువేరా ఫ్లెక్సీల వద్ద పెద్ద ఎత్తున ఫొటోలు దిగుతూ ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యమైన నాయకులు, కేరళ సీఎం పినరయి విజయన్ను చూసేందుకు, వారితో కరచాలనం చేసేందుకు జనాలు పోటీ పడుతున్నారు. ఎంతో బిజీగా ఉన్న ఆయా నాయకులు కూడా వారిని నిరుత్సాహ పరచకుండా చిరునవ్వుతో పలకరిస్తూ, కరచాలనం చేస్తూ ముందుకు సాగుతుండటం కమ్యూనిస్టు పార్టీ గొప్పతనాన్ని తెలియజేస్తున్నది. మహాసభ ప్రాంగణం వద్ద రోజూ కిక్కిరిసిపోతున్న జనాల్నిబట్టి కేరళ జనాలు, పార్టీయే కుటుంబం... ఉద్యమాలే ఊపిరిగా బతుకుతూ... కమ్యూనిస్టు పార్టీలకు అండదండలనిస్తూ జేజేలు పలుకుతున్నారనే విషయం విదితమవుతున్నది. వారు మళయాళంలో ఇచ్చే నినాదాల సారం మనకు అర్థం కాకపోయినా ఆ స్ఫూర్తి మాత్రం వారి గొంతులో ప్రతిఫలిస్తున్నది.
మరోవైపు సీపీఐ (ఎం) అఖిల భారత మహాసభ శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. ఆదివారం అది ముగియనున్న నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక ఇకె నయనార్ అకాడమీ నుంచి ఎర్రదండు కవాతు బయల్దేరుతుంది. రెండు వేల మందితో కూడిన రెడ్ షర్టు వాలంటీర్లు (వెయ్యి మంది పురుషులు, వెయ్యి మంది మహిళలు) ఈ ప్రదర్శనలో కదం తొక్కనున్నారు. మహాసభలో పాల్గొన్న ప్రతినిధులు, కేంద్ర కమిటీ సభ్యులు వారిని అనుసరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభా స్థలైన ఏకే గోపాలన్ ప్రాంగణానికి (జవహర్ స్టేడియం) ప్రదర్శన చేరుకుంటుంది. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బృందా కరత్, మాణిక్ సర్కార్, పినరయి విజయన్, ఎస్.రామచంద్రన్ పిళ్లై, కొడియేరి బాలకృష్ణన్, ఎమ్ఏ బేబి తదితరులు ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభకు కేరళ నుంచేగాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పార్టీ అభిమానులు, కార్యకర్తలు లక్షలాదిగా తరలిరానున్నారు.