Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం పోస్టు ఇస్తామన్నా మాయావతి ముందుకు రాలేదు : రాహుల్
న్యూఢిల్లీ : ఇతర రాజకీయ నేతల వలే తనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అర్థం చేసుకోవడంపైనే తాను ఎక్కువ దృష్టి పెట్టానని వెల్లడించారు. అలాగే బీఎస్పీతో పొత్తు గురించి ప్రస్తావించారు. శనివారం ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పలు విషయాలపై స్పందించారు. ''రాజకీయ నాయకులు అధికారం పొందేందుకు ప్రయత్నిస్తారు. వారు దాని గురించే ఆలోచిస్తారు. ఉదయాన్నే లేచి, అధికారం ఎలా సంపాదించుకోవాలా? అని ఆలోచిస్తారు. అదే ఆలోచనతో నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ దేశం మొత్తం అలాంటి నేతలే ఉన్నారు. అధికారానికి కేంద్రమైన కుటుంబంలో జన్మించాను. నిజం చెప్పాలంటే నాకు అధికారం మీద ఆసక్తి లేదు. దానికి బదులు దేశాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నా''నని అంటూ తన మనసులో మాటలను బయటపెట్టారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఎన్నికల ముందు పొత్తు నిమిత్తం బీఎస్పీ అధినేత్రి మాయావతిని సంప్రదించామని రాహుల్ అన్నారు. ఆమెకు ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేశామని వెల్లడించారు. కానీ ఆమె నుంచి ఏ స్పందనా రాలేదన్నారు. ''ఈసారి ఎన్నికల్లో మాయావతి పోటీ పడలేదు. అది మీరు చూసుంటారు. మనం పొత్తు పెట్టుకుందాం. ముఖ్యమంత్రి పదవి మీకే అంటూ ఒక సందేశం పంపాం. కానీ ఆమె ఒక్కమాట మాట్లాడలేదు. కాంగ్రెస్ ఓడిపోయింది అది వేరే విషయం. యూపీలో దళితుల గొంతు వినిపించేందుకు కాన్షీరామ్జీ ఎంతో పోరాటం చేశారు. కానీ మాయావతి ఆ గళం కోసం పోరాడేందుకు ముందుకు రావటం లేదు. అందుకు కారణం కేంద్ర దర్యాప్తు సంస్థలు. పెగాసస్ వంటి స్పైవేర్లు. వ్యవస్థలు మన చేతిలో లేకపోతే..రాజ్యాంగమూ మన చేతిలో ఉండదు'' అంటూ కేంద్రంపై మండిపడ్డారు.