Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ (అస్సెట్స్) మోనటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) పథకాన్ని వ్యతిరేకించాలని దేశ ప్రజలకు సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. ఆ పార్టీ అఖిలభారత మహాసభ శనివారం ఈ మేరకు తీర్మానం చేసింది. 'దేశ వ్యతిరేకం... ప్రజా వ్యతిరేకం'గా ఈ పథకాన్ని అభివర్ణించిన సీపీఐ(ఎం), ఈ పథకాన్ని ఎక్కడికక్కడ ప్రతిఘటించాలని ప్రజలను కోరింది. నాలుగు సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్ల రూపాయలను సమీకరించడం లక్ష్యంగా మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని తీర్మానంలో తెలిపింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న మౌళికవనరులను దేశంలోని కార్పొరేట్, పెద్ద వ్యాపార సంస్థలతో పాటు విదేశాలకు చెందిన బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టనుందని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తరహాలోనే చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ప్రయివేటీకరణకు మారుపేరుగా బీజేపీ పాలన మారిందనీ, దీనిలో భాగంగానే రాబోయే సంవత్సరాల ఆదాయాన్ని కూడా అంచనావేసి మౌలికవసతులను ప్రయివేటుకు అప్పచెప్పేలా ఎన్ఎంపీని రూపొందించారని పేర్కొన్నారు. 400 రైల్వే స్టేషన్లు, 90 ప్రయాణీకుల రైళ్లు 1400 కి.మీ రైల్వే ట్రాకు, 741 కిలో మీటర్ల కొంకణ్ రైల్వే ఇంకా వివిధ రకాల రైల్వే ఆస్తులను కేవలం 1.5 లక్షల కోట్ల రూపాయలకు ప్రయివేటుకు కట్టబెట్టాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ఇదే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల భూములను తాకట్టుపెట్టేందుకు నేషనల్ లాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. కార్పొరేట్లకు ఆస్తులను కట్టబెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలను అందించడం కూడా ప్రభుత్వ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ లూటీని అడ్డుకోవడానికి కార్మికవర్గంతో పాటు దేశ ప్రజలు సిద్ధం కావాలని కోరారు.