Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాసభలో రెడ్ షర్టు వాలంటీర్ల సందడి
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సీపీఐ (ఎం) 23వ మహాసభ ప్రారంభమైన ఈనెల ఆరో తేదీ నుంచి ఇప్పటి వరకూ అటు ప్రతినిధులు, ఇటు పత్రికా ప్రతినిధుల దృష్టిని ఒక బృందం అదే పనిగా ఆకర్షిస్తుంది. తమకే సొంతమైన ఆహార్యంతోపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ చిరునవ్వుతో ప్రతి ఒక్కరికీ సేవలందిస్తూ.. అవసరమైనప్పుడల్లా స్పందిస్తూ అందరితో 'భేష్... శభాష్...' అనిపించుకుంటున్నది. పార్టీ పట్ల వారికున్న అంకితభావానికి, బాధ్యతకు ముచ్చటపడ్డ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్, కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు ఆ బృంద సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. విరామ సమయాల్లో వారితో ముచ్చటించారు. అంతలా అందరి జేజేలు అందుకున్న ఆ దళమే 'రెడ్ షర్ట్ వాలంటీర్స్...'. మహిళలు, పురుషులతో కూడిన ఈ వాలంటీర్ల బృందం మహాసభ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నది. ప్రతినిధుల సభ ప్రారంభ సూచికగా ఈనెల అరుణ పతాకాన్ని ఎగరేసినప్పుడు వారు చేసిన కవాతు అదరహో అనిపించింది. ఆ బృందానికి తోడుగా బ్యాండ్ ట్రూప్ సంగీతం ఆ సన్నివేశాన్ని మరింతగా రక్తి కట్టించింది. ఆ తర్వాత ప్రతినిధులకు కావాల్సిన కాయితాలు, తీర్మానాల ప్రతులు, మంచినీళ్లను అందించటంతోపాటు ఇతరత్రా అనేక సమయాల్లో వారు అందిస్తున్న సేవలను ప్రశంసించకుండా ఉండలేం. కన్నూరు జిల్లాలో మొత్తం 25 వేల మందితో రెడ్ షర్టు వాలంటీర్ల బృందం ఉందని మహాసభలో ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న కృష్ణన్ తెలిపారు. మహాసభ ముగింపు, బహిరంగ సభ సందర్భంగా వీరిలో రెండు వేల మందితో ఎర్రదండు కవాతు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.