Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభలో తీర్మానం
- ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఇది దోహదం చేస్తుందని ఆశాభావం
కన్నూరు (కేరళ) నుంచి బి.వి.యన్.పద్మరాజు
సీపీఐ(ఎం) నేతృత్వంలో రెండోసారి కేరళలో కొలువుదీరిన వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం అద్భుతమైన విజయాలను సాధించటం పట్ల ఆ పార్టీ 23వ అఖిల భారత మహాసభ హర్షం వ్యక్తం చేసింది. ఆయా విజయాలకు జేజేలు పలుకుతూ మహాసభలో తీర్మానించారు. ఇవి ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు, బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో 2016 నుంచి అధికారాన్ని కొనసాగి స్తుండటం అభినందనీయమని తెలిపింది. ఇదే సమయంలో కేరళ ప్రజానీకం కూడా పార్టీకి, ప్రభుత్వానికి అండదండలనిస్తూ ఈ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం పట్ల మహాసభ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.
'కేరళలో యూడీఎఫ్ నుంచి 2016లో ఎల్డీఎఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్న సమయంలో రాష్ట్రం అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వ్యవసాయరంగం ప్రతికూల వృద్ధిలో ఉంది. పరిశ్రమల కల్పనలో స్తబ్దత నెలకొన్నది. ఉపాధి కల్పన మందకొడిగా ఉంది. అవినీతి పెద్దఎత్తున పేరుకుపోయింది. ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. రాజకీయాల్లోకి మతాన్ని జొప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్... కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా స్థిరమైన ఆర్థిక ప్రణాళికలతో ముందడుగేసింది. మానవాభివృద్ధి సూచికలను మెరగుపరచటమే ప్రాతిపదికగా, ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా పనిచేసింది. ముఖ్యంగా యువతకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించింది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఆదాయాలను పెంచేందుకు కృషి చేసింది. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీటేసింది...' అని తీర్మానంలో పేర్కొన్నారు.
అయితే 2016-21 కాలంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం... ఒకదాని తర్వాత ఒకటిగా వరుస సవాళ్లను ఎదుర్కొన్నదని మహాసభ తన తీర్మానంలో వివరించింది. '2017లో ఓక్చి తుపాను, 2018, 2019లో అతివృష్టి వల్ల కుండపోతగా కురిసిన వర్షాలు, ఫలితంగా తలెత్తిన వరదలు, ఏర్పడ్డ బురద కుప్పలతో రాష్ట్రం అతలాకుతలమైంది. 2018లో రెండు జిల్లాలకు నిపా వైరస్ సోకటంతో ప్రజలు ఆరోగ్య పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టటంతో ఈ దుస్థితి మరింత ఎక్కువైంది. 2019లో కోవిడ్ మూలంగా కేరళ ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూరుకుపోయింది. కేంద్రంలోని మోడీ సర్కారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను దారుణంగా దెబ్బతీసింది. రాష్ట్రాలకు, ముఖ్యంగా కేరళకు నిధులు కేటాయించకుండా వివక్షను ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఎల్డీఎఫ్ సర్కారు... అనేకానేక సవాళ్లను ఎదుర్కొంటూ ఆర్థిక పరంగా స్వల్ప, మాధ్యమిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకోవటం ద్వారా ముందడుగేసింది. ప్రభుత్వ విద్యారంగంలో మౌలికమైన మార్పులను తేవటంతోపాటు పిల్లలందరికీ నాణ్యమైన విద్యనందించటం, పేదలందరికీ ఇండ్లను కట్టించటం, విద్యారంగంలో సమూల మార్పులు తేవటం ద్వారా ప్రజల మన్ననలను పొందింది. పారదర్శక పాలన, అందరికీ అన్ని రంగాల్లో సమానావకాశాలను కల్పించటం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది.
స్థానిక సంస్థల్లో అందరికీ భాగస్వామ్యం, ఐటీ రంగంలో నూతన విధానాలు, ఉపాధి అవకాశాలను కల్పించటం వల్ల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచటం, వ్యవసాయంతోపాటు దాని అనుబంధరంగాలను వృద్ధి చేయటం, లింగ వివక్ష లేకుండా చూడటం, సామాజికంగా రక్షణ కల్పించటం తదితర చర్యలతో ఎల్డీఎఫ్ ప్రజల మనసులను గెలుచుకుంది. ఇలాంటి చర్యలతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన యూడీఎఫ్‌కు, బీజేపీకి అది గట్టి సమాధానం చెప్పగలిగింది...' అని మహాసభ తన తీర్మానంలో పేర్కొంది. తద్వారా కేరళతోపాటు జాతీయ, ప్రపంచ స్థాయిలోని లెఫ్ట్, కమ్యూనిస్టు ఉద్యమాలకు బలాన్ని చేకూర్చిందంటూ ప్రశంసించింది.