Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర మాజీ ఎంపీ నారాయణ్కర్
'ఎన్నికలకు ముందు బీజేపీ ప్రజలను చీల్చింది. మోసపూరిత వాగ్దానాలను ఇచ్చింది. వారిని భ్రమల్లో ఉంచింది. నాలుగేళ్ల బీజేపీ పాలన తరువాత త్రిపుర ప్రజానీకం వాస్తవాలను తెలుసుకుంటున్నారు. అభివృద్దికి బదులుగా హింసా సముద్రంలో మునిగిపోయామని వారు గుర్తించారు. తమ హక్కుల కోసం రోడ్లమీదకు వస్తున్నారు. గళాలు విప్పుతున్నారు. అలా పోరాడుతున్న ప్రజలకు అండగా సీపీఐ(ఎం) నిలబడుతోంది.' అని సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపీ నారాయణ్కర్ అన్నారు.
సీపీఐ(ఎం) 23వ మహాసభలకు ప్రతినిధిగా వచ్చిన ఆయన నవతెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ వివరాలు క్లుప్తంగా
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
త్రిపురలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి?
త్రిపురలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత రాజ్యాంగాన్ని అక్కడ అమలు చేయడం లేదు. ప్రజలు వాక్స్వాతంత్రంతో పాటు జీవించేహక్కును కూడా కోల్పోయారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ ముసుగులో గూండాలు రెచ్చిపోతున్నారు. ఈ కాలంలోనే సీపీఐ(ఎం) 47 కార్యాలయాలను ధ్వంసం చేశారు. వందలాది మంది పార్టీ కార్యకర్తలు దాడులకు గురయ్యారు. నాలుగేండ్ల క్రితం 2018 మార్చి 3వ తేదిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుంచి ఈ హింసాకాండ ప్రారంభమైంది. ఇది యాధృశ్చికంగా జరిగింది కాదని చెప్పడానికి అప్పటినుంచి ఇప్పటిదాకా హింస కొనసాగు తూనే ఉండటమే కారణం. ప్రభుత్వ కన్నుసన్నల్లోనే ఈ హింసాకాండ జరుగుతున్నది. నాలుగేండ్ల కాలంలో 22 మంది పార్టీ కార్యకర్తలు హత్యలకు గుర య్యారు. వీటికి సంబంధించి ఒక్కరిని కూడా పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. 302 సెక్షన్ కింద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కొన్ని సంఘటనల్లో అసలు కేసులే పెట్టలేదు. ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. అందుకే మేం దీన్ని ఫాసిస్టు హింస అని అంటున్నాం. 2013లో జరిగే ఎన్నికల వరకు ఇది కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం.
ఇతర పార్టీలపై కూడా దాడులు జరుగుతున్నాయా?
సీపీఐ(ఎం)పైనే కాదు. ప్రశ్నించే ప్రతి గొంతును బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోంది. అటువంటి వారిని గుర్తించడానికి వారికో యంత్రాంగాం ఉంది. ఒకసారి గుర్తించిన తరువాత అనేక రకాలుగా లోబరచు కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సామ, దాన, భేద, దండో పాయాల్లో అన్నిటిని వాడుతున్నారు. చివరగా నిర్మూలించడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఈ ప్రక్రియనంతా ప్రభుత్వమూ, పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు. కొన్ని సమయాల్లో పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి. వారి లక్ష్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వినపడకూడదనే! మీడియా సంస్థలను కూడా నియంత్రించింది. దేశరకథపై తీవ్రమైన దాడికి దిగింది. కోర్టు ఉత్తర్వులతో పత్రికను నిర్వహిస్తుంటే పంపిణీని అడ్డుకున్నారు. ఎవరైనా దేశరకథను పంపిణీ చేస్తే సీపీఐ(ఎం) నాయకులకు పట్టిన గతే పట్టిస్తామని హెచ్చరించారు. మరో ఒకటి, రెండు పత్రికలకు కూడా ఇటువంటి హెచ్చరికలే అందాయి.
బీజేపీ ఈ స్థాయికి ఒక్కసారిగా ఎలా ఎదిగింది?
2018కి ముందు రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు. కానీ, అంతకు చాలా ముందునుండి కూడా గిరిజన ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ ఆర్ఎస్ఎస్ వివిధ పేర్లతో అనేక కార ్యక్రమాలను నిర్వ హించేది. అలా ప్రజల్లో విభజన బీజాలు వేసింది. 2018లో ప్రజలను భ్రమల్లో ముంచే వ్యూహానికి తెరతీసింది. ఎన్నికల సంవత్సరానికి చాలా ముందే ప్రస్తుత ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్తో పాటు పలువురిని రాష్ట్రానికి పంపింది.కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ను దాదాపుగా మింగేసినంత పనిచేసింది. ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు తప్ప మిగిలిన అందరు కీలకనాయకులు బీజేపీలో చేరారు. ప్రధాని హౌదాలో మోడీ అనేక దఫాలు రాష్ట్రంలో పర్యటించారు. విజన్ డాక్యుమెంట్ పేరుతో 220 హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలిఏడాదిలోనే 50వేలకుపైగా శాశ్వత ఉదోగాలు కల్పించడం, సామాజిక ఫించన్ల మొత్తాన్ని 2000 రూపాయలకు చేర్చడం, ఉపాధి హామీ కింద వేతనాలను రోజుకు 340 రూపాయలకు పెంచడంతో పాటు, రెండువందల రోజులు పని కల్పించడం వంటివి వీటిలో ఉన్నాయి. డబుల్ ఇంజిన్ గవర్నమెంటు వంటి మోడీ నినాదాలతో ప్రజలు ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ ఓట్లు దాదాపుగా బీజేపీకి బదిలీ అయ్యాయి. సాంప్రదాయ సీపీఐ(ఎం) ఓటర్లు కొందరు అటువైపే మొగ్గు చూపారు.
ఈ హామీల్లో ఎన్ని అమలు చేశారు?
హామీలు అమలు చేయడం అటువుంచి, వామపక్ష ప్రభుత్వం అమలు చేసిన వాటిని కూడా బీజేపీ తొలగించింది. ప్రశ్నించిన వారిని లక్ష్యం చేసుకుంది. ఈ కారణంగానే స్థానిక ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలను కూడా నిర్వహించడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడలేదు. ప్రతిసారి కోర్టు జోక్యం చేసుకోవాల్సివచ్చింది.
ప్రజలు దీనిని ఎప్పుడు గుర్తించారు?
ప్రజలందరూ దీనిని గుర్తించారని చెప్పలేం. అయితే, ఆ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిడ్ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తే సీపీఐ(ఎం) శ్రేణులు కదలి సేవలందించడాన్ని ప్రజలు చూశారు. ఎంతో మందిని మృత్యు ముఖం నుండి కాపడటం వారి ప్రశంసలకు కారణమైంది. పెరగిన ధరలు, ఉద్యోగాలు రాకపోవడం, బతకడం కోసం యువత అనేక ప్రాంతాలకు వెళ్లాల్సిరావడం, సామాజిక ఫించన్లలో కోత పెట్టడం వంటి చర్యలు ప్రజల్లో చర్చనీయాంశమైనాయి. వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలోనే అగర్తలలో నాలుగైదు భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి.
సీపీఐ(ఎం)గా ఏం చేయబోతున్నారు?
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర అత్యంత సున్నితప్రాంతం. అస్సోంతో తప్ప భారత్తో ఏ ప్రాంతంతోనూ మాకు రోడ్డు సంబంధాలు లేవు. అనేక ఏండ్ల పాటు తీవ్రవాదం ఇక్కడ ప్రబలింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకోవాలి. నాలుగేండ్ల పాటు దాడులను తట్టుకుని సీపీఐ(ఎం) నిలిచింది. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించే గొంతులను మేం మరింత బలపరుస్తాం. వారిని చైతన్యవంతులను చేస్తాం. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న అంశాన్ని మేం నమ్ముతాం.