Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవ్యవస్థే పరిష్కరించాలి : జస్టిస్ డి.వై.చంద్రచూడ్
న్యూఢిల్లీ : ఇంటర్నెట్ యుగంలో పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. మన చట్టాలు, న్యాయవ్యవస్థే ఈ సమస్యను పరిష్కరించాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ''ఇంటర్నెట్, సాంకేతిక యుగంలో పౌరుల హక్కులు విప్లవాత్మక మార్పులకు లోనయ్యాయి. ప్రభుత్వం, న్యాయవ్యవస్థతో ఉన్న సంబంధాలు చాలా ప్రభావితమయ్యాయి. డిజిటల్ వేదికలపై పౌరుల ప్రతి కదలిక రికార్డ్ అవుతోంది. ఇదంతా ఒక కీలకమైన సమాచారం. ఇందులో పౌరుల వ్యక్తిగత సమాచారమూ ఉంటోంది. ఈ డాటాను భద్రతపర్చే వ్యవస్థ ఉండాలి'' అని అన్నారు. సరైన టెక్నాలజీ సమాజంలోని రుగ్మతల్ని రూపుమాపుతుందని అభిప్రాయపడ్డారు. కానీ సమాజంలో ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అసమానతలు, వివక్ష, కులతత్వం అనేవి తీవ్రస్థాయిలో విస్తరించి ఉన్నాయని అన్నారు.
అందుబాటులోకి రావాలి
ఇంటర్నెట్, సాంకేతిక పరిజ్ఞానంతో పౌర హక్కులు మరింతగా విస్తరించేందుకు ఆస్కారం ఏర్పడింది. కనీస సౌకర్యాలు పొందేందుకు దోహదపడుతోంది. కోవిడ్-19 సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో వర్చువల్, డిజిటల్ కోర్టుల విచారణ అనూహ్యంగా పెరిగింది. కోటీ 96 లక్షల కేసుల్ని కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపాయి. 'ఈ-కోర్టు' సేవల వల్ల న్యాయస్థానాల్లో కోటీ 30లక్షల కేసులు దాఖలయ్యాయి. ఇందులో 83లక్షల కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. 'ఈ-ఫైలింగ్' సాఫ్ట్వేర్ను డెవలప్ చేశాం. ఇదంతా సమాజానికి ఇంటర్నెట్ ద్వారానే వచ్చింది కదా! కాబట్టి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావటం ప్రజాస్వాయుతంగా ఉండాలి.