Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలపై మోడీ సర్కారు అన్ని వైపుల నుంచి దాడి
- ఎర్రజెండా అండతో తిప్పికొడదాం
- కేరళ ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్ ఉద్యమాలను నిర్మిద్దాం :
సీపీఐ (ఎం) కన్నూరు బహిరంగ సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఏచూరి పిలుపు
- లౌకికత్వ పరిరక్షణపై సెక్యూలర్ పార్టీలు ఆలోచించాలని హితవు
- సైద్ధాంతిక పటుత్వంతో మోడీ సర్కారును గద్దె దించుతామని హెచ్చరిక
కన్నూరు (కేరళ) నుంచి బి.వి.యన్.పద్మరాజు
ఒకవైపు మతోన్మాదం.. మరోవైపు ఆర్థిక భారాలు.. ఇంకోవైపు ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మటం.. దీంతోపాటు రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు పని చేస్తున్నదని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఇలా అన్ని వైపుల నుంచి ప్రజలపై దాడి చేస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రజెండా అండతో దాని ఆగడాలను తిప్పికొట్టాలని దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. కేరళలోని కన్నూరులో ఈనెల ఆరు నుంచి ఐదు రోజులపాటు కొనసాగిన సీపీఐ (ఎం) అఖిల భారత 23వ మహాసభ ఆదివారం దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక ఏకేజీ నగర్ (జవహర్ స్టేడియం)లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. సీపీఐ (ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏచూరితోపాటు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్, మాణిక్ సర్కార్, ఎమ్డీ సలీమ్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏచూరి ప్రసంగిస్తూ... కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు. సరళీకృత ఆర్థిక విధానాలకు మతోన్మాదాన్ని జోడించటం ద్వారా అది 'ప్రజలను విభజించి,పాలించు' అనే తన అజెండాను సమర్థవంతంగా అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతూ ప్రజలను లూటీ చేస్తోందని చెప్పారు. మరోవైపు రాజకీయాల్లోకి మతాంశాలను జొప్పించటం ద్వారా ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తోందని వివరించారు. రాజ్యాంగ మూల సూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమాఖ్య వ్యవస్థ, ఆర్థిక స్వావలంబన అనే అంశాలను నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీపీఐ (ఎం)తోపాటు ఇతర వామపక్షాలు, లౌకికత్వ శక్తులు బీజేపీ విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ పోరులో తమ పాత్ర గురించి ఆలోచించుకోవాలని సెక్యులర్ పార్టీలకు హితవు పలికారు. ప్రధాని మోడీ... 'కమ్యూనిస్టు పార్టీలు దేశంలో ఒక మూలకే (కేరళ)కే పరిమితమయ్యాయంటూ మాట్లాడారు. వాస్తవానికి మాకున్న సైద్ధాంతిక పటుత్వమే మిమ్మల్ని, మీ పార్టీనీ గద్దె దించుతుంది...' అని హెచ్చరించారు. ఈ క్రమంలో కేరళలోని సీపీఐ (ఎం), ఇతర కమ్యూనిస్టు పార్టీలు దేశానికి మార్గదర్శనం చేస్తున్నాయని తెలిపారు. మహాసభను దిగ్విజయం చేసిన కన్నూరు ప్రజలకు, కేరళ సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీకి ఏచూరి ఈ సందర్భంగా విప్లవాభివందనాలు తెలిపారు.
గౌరవ వందనం స్వీకరణ...
బహిరంగ సభకు ముందు ఏచూరి... అక్కడి ప్రాంగణంలో రెడ్ షర్టు వాలంటీర్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సీపీఐ (ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ వెంటరాగా ఆయన ఈ గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అడ్డుగోడలను బద్ధలు కొడతాం : పినరయి విజయన్
కేరళ అభివృద్ధికి ప్రతిపక్ష యూడీఎఫ్, బీజేపీ అడుగడుగునా అడ్డు తగులుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. ప్రజాబలంతో ఆ అడ్డుగోడలను బద్ధలు కొడతామని ఆయన ఆయా పార్టీలను హెచ్చరించారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క సమస్యపై కూడా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో గళమెత్తకపోవటాన్ని విజయన్ ఈ సందర్భంగా తప్పుబట్టారు. 'మీరు కేరళ ప్రజలవైపు ఉంటారా..? లేక బీజేపీ వైపా...?' అంటూ కాంగ్రెస్‌కు చురకలంటించారు. అనేక సంక్లిష్ట, సంక్షోభ పరిస్థితులు తమ ప్రభుత్వాన్ని వెంటాడినా...కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన సేవలందించటంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచామని వివరించారు. ప్రజల పట్ల తమకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శమని వ్యాఖ్యానించారు.
నిర్బంధాలకు ఎదురొడ్డిన ఎర్రజెండా : బృందాకరత్
పశ్చిమ బెంగాల్, త్రిపురలో సీపీఐ (ఎం) కార్యకర్తలను తృణమూల్, బీజేపీ మూకుమ్మడిగా హత్య చేయటం, ఆఫీసులను ధ్వంసం చేయటం పట్ల బృందా కరత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బెంగాల్లోనే 250 మందికి పైగా పార్టీ కార్యకర్తలను టీఎమ్సీ, బీజేపీ గుండాలు పొట్టనబెట్టుకున్నాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ఘటనల నేపథ్యంలో సీపీఐ (ఎం) సీనియర్ నేత మహ్మద్ యూసఫ్ తరిగామిని నెలల తరబడి గృహంలో నిర్బంధించారని గుర్తు చేశారు. ఇలాంటి నిర్బంధాలను సైతం ఎదురొడ్డి ఎర్రజెండా పోరాడుతున్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా మహిళలపై లైంగికదాడులు, అఘాయిత్యాలు పెరిగిపోవటం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ధ్వంసం చేస్తున్న బీజేపీ
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిదాన్ని ధ్వంసం చేస్తోందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ విమర్శించారు. బీజేపీని ఒంటరి చేసి, ఓడించేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులన్ని ఏకం కావాలన్నారు. త్రిపుర దేశంలోని అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. ఎందుకంటే త్రిపురలో బిజెపి పాలనలో రాజ్యాంగం అమలుకావటం లేదని అన్నారు. త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రత్యక్ష, పరోక్షంగా సహకరించిందని విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఒక సారి ఆలోచన చేయాలని సూచించారు. లౌకికవాదంపై రాజీపడొద్దని హితవు పలికారు. త్రిపురలో చేసినట్లే, కేరళలో కూడా చేయాలని కాంగ్రెస్ నేతలు ఆలోచించడం దారుణమన్నారు. రాష్ట్రంలో మీడియాపై దాడి జరుగుతుందని, దాదాపు 40 మంది మీడియా ప్రతినిధులపైన, మీడియా సంస్థలపై దాడి జరిగిందని అన్నారు. ఏడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి
ఉద్యమాన్ని నిర్మించడమే లక్ష్యం.
సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం
విశాల ఉద్యమాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం అన్నారు. లౌకికవాదం ప్రశ్నార్థకం అయిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజలపై ద్వేషం పెంచిపోషిస్తుందని, ఒక మతాన్ని టార్గెట్ చేసి ఈ ద్వేషాన్ని పెంచుతుందని విమర్శించారు. కర్ణాటకలో హిజాబ్ అంశాన్ని తీసుకొచ్చారని,ఏం తినాలో బీజేపీ నిర్ణయించేందుకు కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. అందుకే మాబ్ లించింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.. కేంద్రంలోని మోడీలానే, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ప్రభుత్వం రంగ సంస్థలను అమ్మేస్తుందని తెలిపారు. పార్టీ పున:నిర్మాణం కోసం పని చేస్తున్నామని, అందుకనుగుణంగానే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.