Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యంత క్రమశిక్షణ.. అంకితభావాన్ని ప్రదర్శించిన మలయాళీలు
- ఔరా... అనిపించిన ఎర్రదండు కవాతు
కన్నూరు (కేరళ) నుంచి బి.వి.యన్.పద్మరాజు
'ఎవడురా కూసింది కమ్యూనిజం ఇక లేదనీ, ఎవడురా అన్నది కమ్యూనిజం ఇక రాదనీ...' అన్నారో కవి. ఆయన ఏ సందర్భంలో ఆ వాక్యాలను రాశారోగానీ... ఆదివారం కేరళలోని కన్నూరును వీక్షించిన వారు మాత్రం ఆ కవిలో పరాకాయ ప్రవేశం చేసి మళ్లీ అదే వాక్యాలను రాయక మానరు. అంతలా భవిష్యత్ ఉద్యమాలకు భరోసానిస్తూ...గతంతోతోపాటు ఇప్పటి కేరళ కమ్యూనిస్టు వైభవాన్ని చాటిచెబుతూ...'జయహో సీపీఐ (ఎం)' అని మనందరిచేతా అనిపించేలా వామపక్ష ఉద్యమ చరిత్రను కన్నూరు సువర్ణాక్షరాలతో లిఖించింది. సీపీఐ (ఎం) 23వ మహాసభ ఆఖరి రోజైన ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఎర్రదండు కవాతు కమ్యూనిస్టు అభిమానుల హృదయాలను కొల్లగొట్టగా... అక్కడి జనం స్పందన పార్టీ అగ్రనేతల మనసులను దోచుకున్నది. ఇకె నయనార్ అకాడమీ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకేజీ నగర్ (జవహర్ స్టేడియం) వరకూ మూడు గంటలపాటు కొనసాగిన రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతును లక్షలాది మంది ప్రజానీకం వీక్షిరచింది. దారి పొడవున కమ్యూనిస్టు అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు కవాతుకు జన నీరాజనాలు పలికారు. మూడేండ్ల బుడతడి నుంచి పండు ముదుసలి వరకూ అత్యంత క్రమశిక్షణతో, పార్టీ పట్ల తమ అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగినంత సేపూ నినాదాలతో కన్నూరు రోడ్లను హోరెత్తించారు. వారి జోరు, హుషారుకు సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, సుభాషిణీ అలీ, బృందా కరత్ తదితరులు తన్మయత్వం చెందారు. మార్క్సిజం, కమ్యూనిజం పట్ల అంచంచల విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ చిరునవ్వులతో తమకు సాదర స్వాగతం పలికిన కేరళ ప్రజానీకానికి ఆద్యంతం చేతులూపుతూ 'రెడ్ సెల్యూట్...' చేశారు. వారేకాదు... కమ్యూనిజం పట్ల మలయాళీలకున్న ఆదరాభిమానాలను చూసిన వారెవరైనా 'శిరస్సు వంచి నమస్కరించాల్సిందే...'. ఆ మాదిరిగా ఆ కవాతు... ఔరా... అనిపించింది.