Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బూర్జువా పార్టీల్లో వారసత్వంతో యువ నాయుకులు
- అందరి భాగస్వామ్యంతోనే ప్రజా ప్రణాళిక అమలు
- పార్టీ, ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది
- తిరువనంతపురం
మేయర్ ఆర్య రాజేంద్రన్
దేశంలో ప్రజా రాజకీయాల బలోపేతానికి యువతే కీలకమని తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి యువత రావల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే భూర్జువా పార్టీల్లో వారసత్వంతో యువత వస్తున్నారని, దీనివల్ల ఫలితం ఏమీ లేదని పేర్కొన్నారు. అలాంటి రాజకీయ నేతలతో ప్రజలకు ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. కేరళలోని కన్నూర్ (కామ్రేడ్ ఇకె నయనార్ నగర్)లో జరిగిన 23వ సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభకు హాజరైన దేశంలోనే అతి పిన్న వయస్సురాలైన తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ నవతెలంగాణ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అభిప్రాయాలను పంచుకున్నారు.
మీరు మేయర్ అయిన తరువాత ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు..?
తాను మేయర్ అయిన తరువాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం. నేను మేయర్ అయ్యే నాటికి కరోనా పెద్ద సవాల్‌గా నిలిచింది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టాం. ప్రజల భాగస్వామ్యంతో కరోనాను ఎదుర్కొన్నాం. తాను మేయర్ అవ్వకముందే సిపిఎం నేతృత్వంలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధి కోసం విధానాలు రూపొందించింది. దాన్ని అప్పటికే కొనసాగిస్తున్నారు. దాన్ని తాము కూడా కొనసాగిస్తున్నాం. ప్రజలందరికీ విద్య, వైద్యం అందించడం తమ లక్ష్యం. తమ పాలనలో కూడా ఆ రెండు రంగాలకూ ప్రాధన్యత ఇస్తున్నాం. అలాగని ఇతర రంగాలను విస్మరించటం లేదు. తిరువనంతపురాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్య వంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
దేశంలోనే అతి పిన్న వయస్సు మేయర్‌గా ఎలా ఫీలవుతున్నారు..?
దేశంలో పెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో తిరువనంతపురం ఒకటి. దాదాపు పది లక్షలకు పైగా జనాభా ఉన్నారు. వంద వార్డులు ఉన్నాయి. అలాంటి చారిత్రాత్మక కార్పొరేషన్‌కు మేయర్ కావడం సంతోషించగా ఉంది.
మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి, మేయర్ అవ్వడానికి పార్టీ ఎలా సహకరించింది..?
తనకు పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చింది. తనకే కాదు యువతకు పార్టీ పెద్దపీట వేస్తుంది. పార్టీ సీనియర్ల అనుభవాలతో పని చేస్తున్నా. తనను మేయర్‌గా ప్రకటించినప్పుడు కొంత మంది ప్రతిపక్ష పార్టీలు చిన్న పిల్లకు తిరువనంతపురాన్ని అప్పగిస్తున్నారని విమర్శలు చేశారు. దానికి పార్టీ గట్టిగా సమాధానం ఇచ్చింది. తమ మున్సిపల్ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. సరిపడిన నిధులు కేటాయింపు ఉంది.
మీ కంటే సీనియర్లు ఉన్న కార్పొరేషన్‌ను ఎలా లీడ్ చేస్తున్నారు..?
అవును...మా మున్సిపల్ కార్పొరేషన్లో అందరూ సీనియర్లే. వంద మంది కార్పొరేటర్లు ఉన్న కార్పొరేషన్లో నేను అతిపిన్న వయస్సురాలిని. 99 మంది కార్పొరేటర్లు నాకంటే పెద్దవారే. సీనియర్లే. వారి సలహాలు, సూచనలతో కార్పొరేషన్ పాలన సాగుతుంది.
మీరు మేయర్ అయిన తరువాత, మీపై కాంగ్రెస్, బిజెపి నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీరేమంటారు..?
అవును, నేనే మేయర్ అయిన కొన్ని రోజులకే కాంగ్రెస్ ఎంపి నాపై స్త్రీద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇంకొంత మంది ప్రతిపక్ష నేతలు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటికి నే పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే వారి ఆలోచిన విధానం, వారి సంకుచితత్వాన్ని ప్రజలు గ్రహించారు. ప్రజలే సమాధానం ఇచ్చారు. మహిళల పట్ల ఆ పార్టీల నేతలకున్న ద్వేషాన్ని అవి స్పష్టం చేశాయి.
యువ మహిళగా మహిళా సమస్యలపై ఏం చెప్పదలుచుకున్నారు..?
దేశంలోనిమహిళలు ఇంట, బయట సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు మహిళలను మరింత సమస్యల్లోకి నెట్టేస్తుంది. ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలతో ఏకకాలంలో మహిళలు దాడికి గురవుతున్నారు.