Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్
కామ్రేడ్ ఎకె గోపాలన్ నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
ఎర్ర జెండాను ఎవ్వరూ ఆపలేరని సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ అన్నారు. కేరళలోని కన్నూర్‌లో 23వ సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభ ముగింపు సందర్భంగా ఆదివారం నాడిక్కడ క్రామేడ్ ఎకె గోపాలన్ నగర్ (జవహర్ స్టేడియం)లో జరిగిన బహిరంగ సభలో కొడియేరి బాలకృష్ణన్ స్వాగతోపన్యాసం చేశారు. సీపీఐ(ఎం) కు, ఇతర పార్టీలకు స్పష్టమైన తేడా ఉన్నదనీ, సీపీఐ(ఎం) సామాన్య ప్రజల కోసం పని చేస్తోందని పేర్కొన్నారు. మహాసభ జయప్రదం కోసం దాదాపు 4000 ఏరియా, లోకల్ ఆహ్వాన సంఘాలు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రజల నుంచి, కార్మికుల నుంచి రెండు రోజుల పాటు నిధులు సేకరించామని, షాప్‌లు, ఇండ్ల వద్దకు వెళ్లి రెండు రోజుల పాటు నిధులు వసూళ్లు చేశామని అన్నారు. వివిధ అంశాలపై 26 సెమినార్లు నిర్వహించామని, ఒక సైన్స్ ఫెయిర్ నిర్వహించామని తెలిపారు. లక్షలాది మంది పేదలు, సామాన్యులు ఈ బహిరంగ సభకు వచ్చారనీ, అదే సీపీఐ(ఎం) అని పేర్కొన్నారు. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసమే సీపీఐ(ఎం) పని చేస్తోందని, ఈ క్రమంలో కన్నూర్‌లో 171 మంది అమరవీరులు అయ్యారని తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎస్డీపీఐ, ముస్లీం లీగ్ గూండాలు హత్యాకాండాలో కామ్రేడ్స్ విలువైన ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు అందరూ ఏకమై ఎన్నికల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఓడించేందుకు ప్రయత్నం చేశారని, కానీ కేరళ ప్రజలు సీపీఐ(ఎం) తో ఉన్నారని తెలిపారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టారని అన్నారు. కాంగ్రెస్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ హామీ ఇచ్చిందని, తాము సెమీ స్పీడ్ రైలు ప్రాజెక్టును తీసుకొస్తే, దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని విమర్శించారు. అదే ఈ ప్రాజెక్టు అదానీ, అంబానీలకు అప్పగిస్తే ప్రతిపక్షాలు వ్యతిరేకించవని, కానీ ప్రభుత్వం నిర్వహిస్తే వ్యతిరేకిస్తున్నాయని ధ్వజమెత్తారు. మెజార్టీ ప్రజలు సిల్వర్‌లైన్ ప్రాజెక్టును కోరుకుంటున్నారని, అందుకు తాము ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్, ముస్లీం లీగ్ ఏకమై పని చేస్తున్నాయని, అయితే ప్రజలు తమవైపు ఉన్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నాయని మీడియా ప్రచారం చేస్తోందని, అయితే దానికి భిన్నంగా మహాసభ అన్ని అంశాల్లో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని అన్నారు. పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, ప్రధాన కార్యదర్శి, నివేదికలు, తీర్మానాలు అన్ని ఏకగీవ్రంగా ఆమోదం పొందాయని వివరించారు. ''ఎన్నికల ముందు ఎల్డీఎఫ్కు కేవలం 45 కంటే తక్కువ సీట్లు వస్తాయని, యూడీఎఫ్‌కు 100కు పైగా సీట్లు వస్తాయని మీడియా కథనాలు రాశాయి. కొన్ని మీడియా సంస్థలు అయితే ఏకంగా బీజేపీకి 35 పైగా సీట్లు వస్తాయని తెలిపాయి. కానీ అందులో ఒక్కటి కూడా నిజం కాలేదు.బీజేపీకి ఒక్క స్థానం కూడా రాలేదు. కాంగ్రెస్‌కు గతం కంటే సీట్లు తగ్గాయి. మీడియా కథనాలకు భిన్నంగా ఫలితాలు వెల్లడయ్యాయి'' అని వివరించారు.