Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులపై దాడి
- రక్తం కారేలా కర్రలు, ట్యూబ్ లైట్లతో కొట్టిన రౌడీలు
- అరెస్టుకు పోలీసుల వెనకడుగు
- ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద బాదితుల ధర్నా
- చర్యలు తీసుకోవాలి : జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీఘోష్
న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో మళ్లీ ఏబీవీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులపై దాడిచేశారు. రక్తం కారేలా కర్రలు, ట్యూబ్ లైట్లతో చితకబాదారు. ఈ దాడిలో దాదాపు పది మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. అయితే ధర్నాకు వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు అరెస్టుచేసి స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీఘోష్ డిమాండ్ చేశారు. జేఎన్‌యూ హాస్టల్లో నాన్‌వెజ్ భోజనం వడ్డించడంపై హింసకు పాల్పడిన ఏబీవీపీ కార్యకర్తలను గుర్తించగలిగామనీ, ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సోమవారం తెల్లవారు జామున ఫిర్యాదు అందినట్టు పోలీసులు తెలిపారు. నవరాత్రి సమయంలో నాన్ వెజ్ ఫుడ్ వండవద్దని దుండగులు అరవడంతో ఈ దాడి జరిగిందని అన్నారు. ఈ హింసాకాండలో బాలికలు సహా పలువురు విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే బయటకు వచ్చిన వీడియోల్లో ఏబీవీపీ కార్యకర్తలు హాస్టల్లోకి చొరబడి విద్యార్థులపై దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాడి చేసేవారు రాళ్లు రువ్వడం, కర్రలతో విద్యార్థులను దారుణంగా కొట్టడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఆహారాన్ని ఎంపిక చేసుకునే హక్కును హరించే ఏబీవీపీ మతతత్వ చర్యలను ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్ అన్నారు. విలేకరుల సమావేశంలో సోమవారం ఆమె మాట్లాడారు. రామ నవమి సందర్భంగా ఏబీవీపీ చేసిన భయాందోళనకర చర్యలు క్యాంపస్‌లో ప్రజాస్వామ్యపై వారి హింసాత్మక దాడులకు కొనసాగింపేనని విమర్శించారు. 2018, 2019లో జరిగిన జేఎన్‌యూ ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక చర్యలు, 2020 జనవరి 5న విద్యార్థులపై హంతకదాడులను ఆమె గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగమే ఈ దాడులని విమర్శించారు. క్యాంపస్‌లోని కొంతమందిని కిరాయి సైనికులుగా ఉపయోగించుకుని, విద్యార్థులపై ఏబీవీపీ క్రూరంగా దాడి చేస్తుందని ఆరోపించారు. విద్యార్థులు మెస్ భోజనం కోసం తమ సొంత జేబుల నుంచి చెల్లిస్తున్నారనీ తెలిపారు.
అసలేం జరిగిదంటే..?
ఏప్రిల్ 10 (ఆదివారం) మధ్యాహ్నం కావేరీ హాస్టల్‌కు చెందిన కొందరు ఏబీవీపీ కార్యకర్తలు మెస్‌ల పనితీరుకు అంతరాయం కలిగిస్తూ, మాంసాహారం వండడంపై బెదిరింపులకు పాల్పడుతున్న వీడియోలు వచ్చాయి. కావేరీలో ఉద్రిక్త పరిస్థితి గురించి సమాచారం అందడంతో జేఎన్‌యూఎస్‌యూ సమస్యను గుర్తించింది. ఏబీవీపీ మత మత రాజకీయాలను బలపరిచే భౌతిక క్రూరత్వాన్ని ఖండించింది. ఈ వివక్షపూరిత వ్యూహాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ప్రతిఘటించేందుకు అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది. హాస్టల్ జనరల్ బాడీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం, నిర్దిష్ట రోజుల్లో హాస్టళ్లలోని మెనులో శాఖాహార, మాంసాహార ఆహార పదార్థాలు రెండూ ఉంటాయని తేల్చి చెప్పింది. సంవత్సరాలుగా, విద్యార్థులు వారి వ్యక్తిగత ఎంపిక ప్రకారం భోజనం చేస్తున్నారనీ, దాని గురించి ఎటువంటి సమస్యాలేదని తేల్చి చెప్పినట్లు అయిషీఘోష్ అన్నారు.
ఏప్రిల్ 10న రాత్రి భోజనం వడ్డించే సమయంలో కావేరీ హాస్టల్ మెస్‌లో పెద్ద సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు గుమిగూడి శాఖాహారం మాత్రమే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. వారి ఆహార హక్కును పూర్తిగా ఉల్లంఘించడాన్ని ప్రతిఘటించగా.. విద్యార్థులను బెదిరించారు. చెక్క లాఠీలు, ట్యూబ్‌లైట్లు, కర్రలతో పాటు అనేక పదునైన వస్తువులను ఉపయోగించి విద్యార్థులపై హింసాత్మకంగా దాడి చేశారు. ఢిల్లీ పోలీసులు, సైక్లోప్స్ సెక్యూరిటీ ఇద్దరూ అక్కడ ఉండగా ఇదంతా జరిగింది.
ఎస్ఎఫ్ఐ ఖండన
ఏబీవీపీ కార్యకర్తల దాడిని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిస్వాస్ ప్రకటన విడుదల చేశారు. ద్వేషపూరిత రాజకీయాలు, విభజన ఎజెండాను ప్రదర్శిస్తూ ఏబీవీపీ ఈ దాడికి పాల్పడిందని విమర్శించారు. క్యాంపస్‌లో హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారని విమర్శించారు. ఇలాంటి చర్యలతో జేఎన్‌యూ వంటి ప్రజాస్వామ్య, లౌకిక ప్రదేశాలను నాశనం చేయడానికి ఏబీవీపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఇటువంటి ఘటనలు భిన్నత్వాన్ని ప్రమాదంలో పడేస్తాయని అన్నారు.