Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ కూటమిని తిప్పికొడతాం
- సీపీఐ(ఎం) స్వతంత్ర బలం పెంచేందుకు చర్యలు
- త్వరలో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల రాజకీయ, సామాజిక సంఘాల సమావేశం:
- మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
దేశంలో ప్రజాస్వామిక వామపక్ష ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) స్వతంత్ర శక్తిని బలోపేతం చేసేందుకు మహాసభలో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే ముందుకు వెళ్తామనీ, తద్వారా బీజేపీ మతోన్మాద,కార్పొరేట్ కూటమి సవాల్‌ను తిప్పికొడతామని స్పష్టంచేశారు.బీజేపీ,ఆర్ఎస్ఎస్ల హిం దూత్వ ఎజెండాను ఓడించే కార్యాచరణ ప్రణాళికలో భాగం గా త్వరలో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల రాజకీయ, సామాజిక సంఘాల సమావేశాన్ని సీపీఐ(ఎం) ఏర్పాటుచేయనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. కేరళ కన్నూరులోని ఇకె నయనార్ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) కన్నూర్ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్ తో కలిసి సీతారాం ఏచూరి మాట్లాడారు. ఈ సందర్భంగా 23వ పార్టీ అఖిల భారత మహాసభ నిర్ణయాలను వివరించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పడగ విప్పుతున్న హిందూత్వ మతోన్మాద సవాళ్లను ఎదుర్కొనేందుకు పార్టీ అఖిల భారత మహాసభ కార్యాచరణ ప్రణాళికకు పిలుపునిచ్చిందన్నారు. ప్రత్యామ్నాయ చర్యలతో లౌకిక, ప్రగతిశీల శక్తుల మధ్య ఐక్యతతో కేంద్ర ప్రభుత్వ సవాల్‌ను స్వీకరించేందుకు వామపక్షాలు కృత నిశ్చయంతో ఉన్నాయని అన్నారు. ఫాసిస్టు శక్తులు ప్రజలను మతపరంగా, జాతిపరంగా ధ్రువీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజా నిరసనలను అణిచివేసేందుకు హిందూత్వశక్తులు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. దేశంలో ప్రజాస్వామిక ప్రత్యామ్నాయం కోసం వామపక్షాల నేతృత్వంలోని సీపీఐ(ఎం) నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
లౌకికవాదం, ఫెడరలిజం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు లౌకిక కూటమిని బలోపేతం చేస్తామని ఏచూరి తెలిపారు. పార్టీ అఖిల భారత మహాసభ హిందూత్వ ఎజెండాను అధిగమించే భరోసా కల్పించిందని అన్నారు. వామపక్ష పార్టీల పోరాటం అసోంతో సహా ఉత్తరాది రాష్ట్రాలకు చేరుకుందని తెలిపారు. ఫాసిస్ట్ శక్తులు మతపరమైన మార్గాల్లో ప్రజలను ధ్రువీకరించడానికి ప్రయత్నిస్తున్నాయనీ, సామాన్య ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్యలను అణచివేస్తున్నారని విమర్శించారు. ఆ సమస్యలపై సీపీఐ(ఎం) పని చేస్తుందని అన్నారు. ఇందుకోసం పార్టీ అట్టడుగు స్థాయిలో కార్యకలాపాలను విస్తృతం చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అట్టడుగు స్థాయి ప్రజల మధ్య పని చేయడం ద్వారా పార్టీ కార్యాచరణను విస్తృతం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలి విడతగా ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యదర్శులతో త్వరలో సమావేశం కానున్నట్టు చెప్పారు.
ప్రజలు మత ప్రాతిపదికన విభజించే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రాజకీయ, సైద్ధాంతిక, సాంస్కృతిక జోక్యాలు అవసరమని స్పష్టం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదనీ, ఈశాన్య భారత దేశానికి కూడా మతతత్వాల తాకిడి పెరుగుతోందనీ, అసోం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి విజృంభిస్తోందని విమర్శించారు. హిజాబ్ వంటి అంశాలే బీజేపీ ప్రధాన ఎజెండా అని, దీన్ని అమలు చేసేందుకు ఆ పార్టీ అన్ని మార్గాలను అన్వేషిస్తోందని ఏచూరి అన్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమంలో రైతులు బలంగా పాల్గొన్నారని, అందువల్లనే ఆ ఉద్యమం విజయవంతం కావడానికి సాధ్యమైందని అన్నారు. ఢిల్లీలో నిరసనకు ముందు నాసిక్ నుంచి ముంబాయి వరకు నిర్వహించిన లాంగ్ మార్చ్ విజయవంతంగా ముగిసిందని గుర్తు చేశారు. వివిధ రైతు సంఘాల నిరసనను సమన్వయం చేయడంలో లాంగ్ మార్చ్ ప్రభావవంతంగా ఉందని అన్నారు.
అలాగే ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల నేతలు బీజేపీ ప్రమాదాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. తద్వారా వాస్తవాలు తెలుసుకోవాలి. లేదంటే సమాఖ్య వ్యవస్థ మరింత ప్రమాదంలో పడటం ఖాయం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి ఢిల్లీలో ధర్నా చేయటం మంచిదే. కానీ, అదే కేసీఆర్ కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతునివ్వలేదు. ఈరకంగా ఆయా ప్రాంతీయ పార్టీలు ఒక్కోసారి దేశప్రయోజనాలకంటే... తమ ఉనికి కోసమే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీలు లౌకికవ్యవస్థ పరిరక్షణ కోసం మరింత ముందుకురావాలి. దృఢంగా పోరాడాలి అని ఏచూరి వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయాన్ని, ఆయన సార్వత్రిక సమ్మెకు మద్దతునివ్వని విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఏచూరి పై విధంగా సమాధానమిచ్చారు.
సిల్వర్ లైన్ కేరళకు అవసరమైన ప్రాజెక్ట్ అని అన్నారు. కేరళ ప్రజల జీవన ప్రమాణాలు యూరోపియన్ దేశాల ప్రమాణాలకు చేరుకున్నాయని అన్నారు. సిల్వర్‌లైన్ అనేది ప్రభుత్వ ఆసక్తితో కూడిన ప్రాజెక్ట్ మాత్రమే కాదు, కేరళ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్ట్ కూడా అని అన్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి ప్రాజెక్టులే కేరళను ప్రస్తుత స్థితి (అభివృద్ధి)లోకి తీసుకొచ్చాయని తెలిపారు.
మహారాష్ట్రలో బుల్లెట్ రైలు ప్రాజెక్టును సీపీఐ(ఎం) వ్యతిరేకించడం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. బుల్లెట్ రైలు, సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ రెండూ చాలా భిన్నమైన ప్రాజెక్టులని ఏచూరి బదులిచ్చారు. ఈ రెండు ప్రాజెక్టులను పోల్చకూడదని అన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కింద భూసేకరణ విధానాన్ని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తోందని ఏచూరి వివరించారు. సరిపడా పరిహారం ఇవ్వకుండా భూమిని సేకరిస్తున్నందున సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. పరిహారం విషయంలో రెండు ప్రాజెక్టుల మధ్య వ్యత్యాసం ఉందన్నారు.