Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్చువల్ సమావేశంలో మోడీతో బైడెన్
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. సోమవారం ప్రధాని మోడీ , అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య వర్చువల్ సమావేశం జరిగింది. దీనిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి సహా పలు అంశాలపై ఇద్దరూ చర్చించారు. అలాగే మే 24న జరిగే క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని మోడీని కలవాలనే ఆకాంక్షను బైడన్ వెల్లడించారు. ప్రజాస్వామ్యం ఇబ్బందులను చర్చల ద్వారా మార్గం సుగమం చేస్తుందని ఈ సందర్భంగా మోడీ చెప్పారు. ''ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నాను. మేం ఉక్రెయిన్‌కు సహాయం చేయడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తున్నాం'' అని ఈ సందర్భంగా బైడెన్ అన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత దిగజారుతున్న సమయంలోనూ చర్చలు జరుపుతున్నామని మోడీ తెలిపారు. 20 వేలమందిని భారత్‌కు తెచ్చామనీ, వీరిలో చాలా మంది యువ విద్యార్థులేనని వివరించారు. ''ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో చాలాసార్లు మాట్లాడాను. ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా మాట్లాడాలని పుతిన్‌ని కోరాను. భారత్ పార్లమెంటులో ఉక్రెయిన్ సమస్య చాలా చర్చనీయాంశమైంది'' అని ఈ సందర్భంగా మోడీ వివరించారు. భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్టు సమావేశానికి ముందు అధ్యక్షుడు బైడెన్ ట్వీట్ చేశారు. రక్షణతో సహా అనేక రంగాల్లో అమెరికా, భారత్‌ల మధ్య భాగస్వామ్యం బలమైందని వివరించారు. ఉక్రెయిన్‌కు భారత్ చేసిన సహాయాన్ని తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.