Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది విద్యలో నాణ్యతను మెరుగుపర్చదు
- సీయూఈటీపై విద్యావేత్తల అసంతృప్తి
- కేంద్ర విశ్వవిద్యాలయాల్లో యూజీ ప్రవేశాలకు యూజీసీ మార్పులు
న్యూఢిల్లీ : కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) అడ్మిషన్ల కోసం కేంద్రం తీసుకొచ్చిన నూతన మార్పుపై వ్యతిరేకత వస్తున్నది. గతంలో బోర్డు ఎగ్జామ్లలో వచ్చిన మార్కుల ఆధారంగా సెంట్రల్ యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలుండేవి. అయితే, ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ వర్సిటీల్లో ప్రవేశాలకు గానూ ఒక పరీక్షను తప్పనిసరి చేశారు. అదే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ). ఇప్పుడు ఈ ఎంట్రన్స్ టెస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ పరీక్ష విద్యార్థులపై భారం మోపేలా ఉన్నదని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ నాణ్యతను మెరుగుపర్చదని తెలిపారు.
యూజీసీ సమర్ధన
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలకు నిధులను సమకూర్చే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ మార్పును ప్రకటించింది. అది కూడా యూనివర్సిటీ అడ్మిషన్లు జరగడానికి మూడు నెలల ముందు, బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలోనే కావడం గమనించాల్సిన అంశం. అయితే, ఈ మార్పుపై విద్యావేత్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నప్పటికీ యూజీసీ మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నది. ఇది 'స్టూడెంట్ ఫ్రెండ్లీ' మార్పు అని యూజీసీ చైర్మెన్ తెలిపారు. అలాగే, స్టేట్ బోర్డు, సెంట్రల్ బోర్డు ఎగ్జామినేషన్ వంటి వివిధ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఈ మార్పు 'స్థాయికి తగిన చోటు' ను కల్పిస్తుందని వివరించారు.
కొత్త టెస్టుకు రెండు వారాలే సమయం
బోర్డు పరీక్షల అనంతరం కొత్త టెస్టుకు ప్రిపేర్ కావడానికి విద్యార్థులకు రెండు వారాలు మాత్రమే సమయం ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే, ఐదు వేర్వేరు సబ్జెక్టు పేపర్ల పైనా విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే, యూజీసీ ప్రకటన కాస్త ముందుగా వచ్చి ఉంటే లేదా సీయూఈటీ 2023 వరకు ఆలస్యమైనా అది మరింత 'స్టూడెంట్ ఫ్రెండ్లీ'గా ఉండేదని విద్యావేత్తలు చెప్పారు. కొన్ని స్టేట్-లెవెల్ బోర్డులు విద్యార్థులకు అనవసర ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా మార్కులను పెంచుతాయన్నది కొందరు వినిపిస్తున్న ఆరోపణ. అయితే, ఇలాంటి అవకతవకల్లో ఏదైనా బోర్డు నిమగమైనట్టు ఆధారాలుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ, ఇందుకు కొత్తగా పరీక్షల పేరుతో విద్యార్థులపై మానసికంగా భారం మోపడం ఎంత వరకు సమంజసమని విద్యావేత్తలు ప్రశ్నించారు.
ఏకీభవించని విద్యావేత్తలు
యూజీసీ ప్రకటనలతో మాత్రం దేశంలోని పలువురు విద్యావేత్తలు ఏకీభవించడం లేదు. '' సీఈయూటీ ఖర్చుతో కూడుకున్నది కాకపోవచ్చు. సాధారణమైనదే కావచ్చు. కానీ ఇది ఉన్నత విద్యలో నాణ్యతను మెరుగుపర్చదు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి కారణంగా దాదాపు రెండేండ్ల పాటు విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకే పరిమితమయ్యారు. జనవరి నుంచే వారు ప్రత్యక్ష తరగతులు హాజరవుతున్నారు. వచ్చి రాగానే వారు ప్రీ-బోర్డు ప్రిపరేషన్ టెస్టుల్లో నిమగం కానున్నారు. ఆ తర్వాత రెండు దశల్లో జరిగే బోర్డు ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులు ఇన్ని పాట్లు పడి పరీక్షలు రాసినప్పటికీ అందులో వచ్చే మార్కులను పరిగణలోకి తీసుకోకుండా యూజీ ప్రవేశాల కోసం మరొక పరీక్ష రాయాలని యూజీసీ తీసుకొచ్చిన మార్పు విద్యార్థులపై మరింత ఒత్తిడిని పెంచుతుందని విద్యావేత్తలు ఆరోపించారు.
'మోడీ సర్కారు పునరాలోచన చేయాలి'
సంస్కరణల పేరుతో మోడీ సర్కారు హడావుడిగా తీసుకొస్తున్న ఇలాంటి మార్పులు విద్యావ్యవస్థను దిగజారుస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పలు అంశాల్లోనూ కేంద్రం ఈ విధంగానే వ్యవహరించి విమర్శపాలైన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు. గతేడాది తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, 2020లో అకస్మాత్తుగా తీసుకొచ్చిన లాక్డౌన్, 2016లో పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను వారు లేవనెత్తారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీయూఈటీ విషయంలో మోడీ సర్కారు మరొకసారి ఆలోచించాలని విద్యావేత్తలు తెలిపారు. పరీక్షను వాయిదా వేసినా విద్యార్థులకు కొంతలో కొంత ఉపశమనం కలుగుతుందని సూచించారు.