Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు రెండోస్థానం
- ఏడోస్థానంలో గుజరాత్
న్యూఢిల్లీ : సులభతరంగా విద్యుత్ కనెక్షన్లు, విశ్వసనీయతలో దేశంలోనే కేరళ టాప్‌లో నిలిచింది. అండర్ యాక్సెస్ అఫర్డబుల్, రిలయబుల్ ఎనర్జీ (ఏఏఆర్) విభాగంలో కేరళ 67.3 స్కోర్ సాధించగా, 60.4 స్కోర్‌తో తెలంగాణ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 'స్టేట్ ఎనెర్జీ, క్లైమేట్ ఇండెక్స్' (ఎస్ఈసీఐ)లో భాగంగా నిటి ఆయోగ్ మొదటి రౌండ్ నివేదకను తాజాగా విడుదల చేసింది. అందులో విద్యుత్ కనెక్షన్లు సులభతరంగా అందజేయటం, విశ్వసనీయతలో కేరళ మొదటిస్థానంలో నిలబడింది. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం, వ్యవసాయం, పరిశ్రమలకు సరఫరా అయిన విద్యుత్, విద్యుత్ సబ్సిడీ, టారీఫ్..అనే ఐదు అంశాల్లో ఆయా రాష్ట్రాలు సాధించిన స్కోర్ ఆధారంగా 'ఏఏఆర్'లో ర్యాంకుల్ని నిటి ఆయోగ్ విడుదల చేసింది. 'ఏఏఆర్'లో గుజరాత్ 7వస్థానంలో, ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో నిలబడ్డాయి. విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కాంలు) పనితీరులో పంజాబ్ 77.1 పాయింట్లు సాధించి మొదటిస్థానంలో, 55.1 పాయింట్లతో తెలంగాణ 18వ స్థానంలో నిలబడ్డాయి. తెలంగాణ..పర్యావరణ సహాయకారిలో 12వ స్థానంలో, నూతన ఆవిష్కరణల విభాగంలో 19వ ర్యాంక్‌ను పొందింది. మొత్తం ఆరు ముఖ్యమైన విభాగాల్లో ఆయా రాష్ట్రాలు సాధించిన మార్కుల ఆధారంగా నిటి ఆయోగ్ 'స్టేట్ ఎనెర్జీ, క్లైమేట్ ఇండెక్స్'ను రూపొందించింది. విద్యుత్ సామర్థ్యం, పర్యావరణ సహాయకారి, ఉజ్వల్ డిస్కాం, తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్ పంపిణీ, ఎనెర్జీ ఫ్రెండ్లీ, నూతన ఆవిష్కరణలు..అనే విభాగాల్లో నిటి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకూ స్కోరింగ్ విడుదల చేసింది. మొత్తం సూచికలో 50.1 పాయింట్లతో మొదటి స్థానంలో గుజరాత్, 49.1 పాయింట్లతో కేరళ రెండోస్థానంలో, 48.6 పాయింట్లతో పంజాబ్ మూడో స్థానంలో నిలబడ్డాయి.