Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిట్టుబాటు ధర హామీ కోసం పోరాటం ప్రారంభం
- ఏప్రిల్ 17 వరకూ నిరసనలు కొనసాగుతాయి : ఎస్కేఎం
న్యూఢిల్లీ : రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 'గిట్టుబాటు ధర హామీ వారం' పోరాటాన్ని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రారంభించింది. ఏప్రిల్ 11 నుంచి 17 వరకు వారం రోజులపాటు దేశవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు, సమావేశాలు, సెమినార్లు తదితర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఎంఎస్పీ హామీ వారోత్సవానికి మద్దతుగా అనేక రాష్ట్రాల్లో మంగళవారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. స్వామినాథన్ కమిషన్ నివేదిక ఆధారంగా కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కోసం ఎస్కేఎం తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఎస్కేఎం నేతలు దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ తదితరులు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. రైతు ఉద్యమం 2020 నవంబర్ 26న ప్రారంభం కావడానికి చాలాకాలం ముందు నుంచి రైతులు ఎంఎస్పీ డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు. ఇది రైతు ఉద్యమ కీలక డిమాండ్లలో ఒకటని స్పష్టంచేశారు. ఎస్కేఎం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన 11 రౌండ్ల చర్చల సమయంలో ఎంఎస్పీ చట్టపరమైన హామీ కూడా ఆరు కీలక డిమాండ్లలో ఒకటిగా ఉందని తెలిపారు. 2021 డిసెంబరు 9న ఎస్‌కేఎంకు కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలో చేసిన కీలక హామీలలో ఇది కూడా ఒకటని తెలిపారు. ఆ హామీతోనే తాము ఢిల్లీలో ఆందోళన వేదికలను ఎత్తివేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినప్పటికీ, నాలుగు నెలలు గడిచినా ఎంఎస్పీ హామీపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక కమిటీని ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని వ్యతిరేకిస్తూ ఎస్కేఎం జనవరి 31న ''ద్రోహ దినం''ను నిర్వహించిందనీ, మార్చి 21న మళ్లీ దేశవ్యాప్త నిరసనలు, రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించిందని తెలిపారు. ఎంఎస్పి గ్యారెంటీ వీక్‌కు మద్దతుగా అనేక రాష్ట్రాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పంజాబ్‌లో, మొహాలి, ఫిరోజ్‌పూర్, ఫజిల్కా, గురుదాస్పూర్ల లో ఎంఎస్పీ చట్టపరమైన హామీ కోసం ప్రధానమంత్రికి రాసిన మెమోరాండం జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. మధ్యప్రదేశ్ రేవాలోని బిచియా నది నుంచి ఎంఎస్పీ కోసం జల సత్యాగ్రహం ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం మధ్యప్రదేశ్‌లోని వివిధ గ్రామాల మీదుగా సాగుతుంది. ఏప్రిల్ 17న మధ్యప్రదేశ్‌లోని టెంథర్ వద్ద కిసాన్ మహా పంచాయత్‌తో ముగుస్తుంది. హర్యానాలో తోల్, కురుక్షేత్రం ధాన్యం మార్కెట్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. మహారాష్ట్రలోని పూణెలో సెమినార్ జరిగింది. కర్నాటకలోని మైసూరులో సదస్సు జరిగింది. మైసూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో ఆందోళన చేపట్టారు. బీహార్‌లోని పాట్నాలో ఎంఎస్పీ డిమాండ్ చేస్తూ రెండు రోజుల సెమినార్ జరుగుతుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, బీహార్‌లో మరిన్ని నిరసనలు, ప్రదర్శనలు, సెమినార్లు జరిగాయి.