Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ ప్రభుత్వం ప్రజా అనుకూల విధానాలు
- భూమి, కూలీ, ఉపాధి, సామాజిక వివక్షపై దేశవ్యాప్త ఉద్యమాలు
- ఏప్రిల్ 27న వ్యవసాయ కార్మిక సంఘాలతో జాతీయ సమావేశం :
ఎఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు కార్పొరేట్లకు కొమ్ము కాస్తుంటే, కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. మంగళవారం కేరళలోని అలెప్పి సముద్ర తీర బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. తొలుత స్థానిక ప్రజలు వందలాది నాటు పడవలకు వ్యవసాయ కార్మిక జెండాలు కట్టుకొని వారి సాంప్రదాయ పద్ధతుల్లో నాయకత్వానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వెంకట్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ఆస్తులు పెంచేందుకు కష్టపడుతుంటే, కేరళ వామపక్ష ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నదని అన్నారు. అందుకే కేరళ ఈరోజు ఏమి ఆలోచిస్తున్నాదో... రేపు దేశం దాన్ని ఆలోచిస్తుందనే చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మికుల, ఇతర శ్రామికుల హక్కులను కాపాడడంలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అన్ని రాష్ట్రా ప్రభుత్వాలకు మార్గదర్శకత్వంగా ఉంటాయని అన్నారు. కేరళ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు మెరుగైన వేతనాలు, భూపంపిణీ, సామాజిక న్యాయం, ఉపాధి కల్పించడంలో ముందు భాగాన ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వాలు అధిక ధరలు, అంటరానితనం, అవమానాలు, దౌర్జన్యాలు చట్టవ్యతిరేక చర్యలతో పేదలను మరింత హింసిస్తున్నాయని ఆయన విమర్శించారు.
1940లో కేరళలో వ్యవసాయ కార్మిక సంఘం అలెప్పి సముద్రతీర ప్రాంతంలో బ్యాక్ వాటర్ ప్రాంతంలోని కుట్టునాడులో ప్రారంభమైందని అన్నారు. ఆ ప్రాంతంలో ప్రజల్ని కలిసిన సందర్భంలో వారు చూపిన ఆదరణ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమాల పట్ల వారు చూపించే ఆసక్తి, అభిమానం మరువలేనివని ఆయన అన్నారు. కేరళ వ్యవసాయ కార్మిక ఉద్యమ నేతలు కృష్ణ పిళ్లై, వి.ఎస్ అచ్యుతానందన్ ఆ ప్రాంత ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. ప్రభుత్వాలు భూస్వామ్య, దోపిడీ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తుంటే, వ్యవసాయ కార్మిక ఉద్యమం పేదల కోసం నిలబడి పోరాడే క్రమంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. శ్రీధరన్, వాసుదేవన్ లాంటి నేతలు తమ ప్రాణాలు అర్పించారన్నారని గుర్తు చేసుకున్నారు. అమరవీరుల శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ ప్రాంతంలో అనేక సభలు జరిగాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించనున్నట్టు తెలియజేశారు. భూమి, వేతనాలు, ఉపాధి హామీ మొదలైన సమస్యల మీద జాతీయస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ఏప్రిల్ 27న దేశంలోని వ్యవసాయ కార్మిక సంఘాలతో ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని, ఆ సదస్సులో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక కష్టజీవుల వ్యతిరేక విధానాలపై సమరశీల ఉద్యమాలకు ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఉరి తీయడానికి సిద్ధమైందని విమర్శించారు. కొలతలు ప్రకారం వేతనాలు అంటూనే రెండు పూటలా హాజరు వేయాలంటూ మార్పులు చేయటం, అడిగిన అందరికీ పని కల్పించాలని చట్టం చెబుతున్నా పనిదినాల కుదింపు, బడ్జెట్ కేటాయింపుల కోతలతో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు ఉపాధి హామీ మీద, కూలీలమీద మాట్లాడుతున్న మాటలు పేదలను అవమానపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ సమస్యలపై చలో పార్లమెంటుతో పాటు, దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని తెలిపారు.
ఆకలితో అలమటిస్తుంటే..
దేశంలో 8 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వ గోడౌన్లో మూలుగుతుంటే, ఆకలితో అలమటిస్తున్న పేదలకు పంచేందుకు ప్రభుత్వానికి చేతులు రావడం లేదని దుయ్యబట్టారు. ధరల నియంత్రణకు బఫర్ స్టాక్ కేంద్రాలు అవసరమని, అయితే స్టాక్ పాయింట్లు మొత్తాన్ని ప్రయివేటు శక్తులకు అప్పజెప్పే చర్యలకు ప్రభుత్వం పాల్పడిందని అన్నారు. దీనివల్ల బ్లాక్ మార్కెట్లతో నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరగటం, సామాన్య ప్రజల జీవితాలు అస్తవ్యస్తం కావటం జరుగుతుందని పేర్కొన్నారు. పేదలకు భూములు పంచేందుకు తెచ్చిన భూసంస్కరణల చట్టాన్ని సవరించి కార్పొరేట్లకు అడ్డగోలుగా పంచేందుకు మోడీ ప్రభుత్వం యోచిస్తోందని విమర్శించారు.
దేశానికి అనేకమంది మేధావులను అందించిన జేఎన్ యూలో ఏబీవీపీ, అరాచక శక్తులు సాగిస్తున్న చర్యలు గర్హనీయమని అన్నారు. ప్రజాతంత్ర భావాలను, అభ్యుదయ శక్తులను అణిచివేసే చర్యలకు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. ఈ దృష్ట విధానాలను అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులను కదిలిస్తామని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కేరళ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంజక్షన్ తదితరులు పాల్గొన్నారు.