Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రకటన వెనక్కి తీసుకోవాలి
- జేఎన్‌యూ కావేరీ హాస్టల్ కమిటీ, మెస్ కమిటీ ప్రకటన
న్యూఢిల్లీ : జేఎన్‌యూలోని కావేరీ హాస్టల్ వార్డెన్ల పూర్తి అసమర్థత, హింసను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించడంపై స్వతంత్ర విచారణ చేపట్టాలనీ, అంతకు ముందు వారిని సస్పెండ్ చేయాలని కావేరీ హాస్టల్ కమిటీ, మెస్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఏప్రిల్ 10న కావేరీ హాస్టల్లో ఏబీవీపీ గూండాల దాడి ఘటనపై కావేరీ హాస్టల్ కమిటీ, మెస్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. హాస్టల్ వార్డెన్ల అసమర్థత, నిర్లక్ష్యంపై స్వతంత్ర విచారణ చేయాలనీ, విచారణలో వారు దోషులుగా తేలితే, వార్డెన్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జేఎన్‌యూ పరిపాలన కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన పూర్తిగా తప్పు అనీ, దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రతినిధులు తప్పనిసరిగా వచ్చి కావేరీ హాస్టల్ వద్ద దాడి బాధితులను కలుసుకోవాలనీ, హింసకు పాల్పడిన వారిని గుర్తించాలని కోరారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కావేరీ హాస్టల్లో జరిగిన దురదృష్టకర సంఘటనలు పరిపాలనా నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంది. ఆహారాన్ని ఎంపిక చేసుకునే హక్కును అణచివేయడం, రాజకీయం చేయడంలో భాగమని స్పష్టం చేసింది. వివిధ కారణాల వల్ల కావేరీ హాస్టల్‌కు సంబంధించిన అంతర్గత విషయం బయటకు పొక్కిందనీ, అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో మెస్ మెనూని నిర్ణయించే మెస్ కమిటీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిందనేనని స్పష్టం చేసింది. హాస్టల్లో వారంలో నాలుగు రోజులు (సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో) శాఖాహారంతో పాటు నాన్-వెజ్ ఫుడ్ అందుబాటులో ఉంటుందనీ, ఆహార పదార్థాలు అందుబాటులో లేకపోవడం వంటి సందర్భాల్లో కాకుండా ఏ ఒక్క రోజు మెనూను ఏకపక్షంగా మార్చలేదని తెలిపింది. అది కూడా తప్పనిసరిగా మారవలసి వస్తే, హాస్టల్లో ఉన్న విద్యార్థులతో ఒక జనరల్ బాడీ మీటింగ్ (జీబీఎం) ద్వారా అటువంటి మార్పును చేర్చుతుందని తెలిపింది. నవరాత్రుల రోజుల్లో విద్యార్థి సంఘం అభిప్రాయంతో మెనూలో మార్పు ఉండదని, శాఖాహారం, మాంసాహారం వండి విద్యార్థులు తమ ఇష్టానుసారంగా తింటారని స్పష్టం చేసింది.
ఏబీవీపీ తప్పుడు వాదనలు
ఏబీవీపీ ప్రకటనలు, ఆ సంఘం నేతల ఇంటర్వ్యూల్లో వామపక్ష సంఘాలు, హాస్టల్ కమిటీ రామనవమి పూజ కోసం తమ వేడుకలను చాలాకాలంగా అభ్యంతరం వ్యక్తం చేశాయనీ, ఆ రోజు ఆహార మెనూపై ఏబీవీపీ స్వయంగా అభ్యంతరం చెప్పలేదని పేర్కొంది. అయితే ఏ విద్యార్థి సంఘం, హాస్టల్ కమిటీ, విద్యార్థులు పూజపై ఏ విధంగానైనా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఎటువంటి ఆధారాలు అందించలేకపోయిందని పేర్కొంది. నిజానికి, దీనికి విరుద్ధంగా నిరూపించడానికి వీడియోలు ఉన్నాయి. నవమి పూజ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటలకు ముగిసింది. ఇఫ్తార్ సాయంత్రం 6:45 గంటలకు జరిగింది. సన్నాహాలు 30 నిమిషాల ముందు ప్రారంభమయ్యాయి. ఇఫ్తార్‌తో పాటు పూజా కార్యక్రమాలు సజావుగా జరిగాయి. హాస్టల్ విద్యార్థులు, ఇతర విద్యార్థులు పాల్గొన్నారు. అందువల్ల వారి మొదటి వాదన తప్పుగా ఉంది.
ఏబీవీపీ కార్యకర్తలు, వారిలో చాలా మంది కావేరీ హాస్టల్ విద్యార్థులే కాదు. వాస్తవానికి కోడి మాంసం సరఫరాదారుని ఒకటికి రెండుసార్లు బెదిరించి, అతన్ని పంపించివేసినట్టు నిరూపించ డానికి వీడియోలు ఉన్నాయి. మొదటిసారి మధ్యాహ్నం 2 గంటల సమయంలోనూ, రెండోసారి దాదాపు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో బెదిరింపునకు దిగారు. దీనిని కోడి మాంసం సరఫరాదారు అధికారిక ప్రకటన స్పష్టం చేస్తుంది. ఏబీవీపీ రెండు తప్పుడు వాదనలు చేయడం, ఘటనను మతపరమైన దిశలో వక్రీకరించడానికి ప్రయత్నించడం స్పష్టంగా తేలిందని కమిటీ పేర్కొంది. ఈ సమస్య ఆహార స్వేచ్ఛకు సంబంధించినదనీ, అదే సమయంలో ఇతర హాస్టళ్లలో నాన్ వెజ్ ఫుడ్ ను ఇబ్బంది లేకుండా వండారని తెలిపింది. అయితే కేవలం కావేరి హాస్టల్ ని మాత్రమే అనర్ధాలకు వేదికగా ఏబీవీపీ ఎంచుకుందని స్పష్టం చేసింది.
అధికారుల నిర్లక్ష్యం
రామనవమి సందర్భంగా హాస్టల్ ఆవరణలో పూజా కార్యక్రమం ఉన్నందున ఏప్రిల్ 10న నాన్ వెజ్ ఫుడ్ వండరాదని ఏకపక్షంగా నిషేధం విధించేందుకు వార్డెన్లు ప్రయత్నించారు. ఏప్రిల్ 9న సాయంత్రం మెస్ కార్యదర్శికి వాట్సాప్ సందేశం పంపారు. అలాంటి నిర్ణయాన్ని మెస్ కమిటీపై విధించరాదని మెస్ కార్యదర్శి స్పష్టం చేశాడు. మెస్ మెనులో వార్డెన్లు జోక్యం చేసుకోలేరు. ఇలా పదే పదే విన్నవించినా కావేరీ హాస్టల్‌కు అధ్యక్షత వహించిన ఏ అధికారి లిఖితపూర్వకంగా ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ మెస్ సెక్రెటరీ, వార్డెన్ షరతులను అంగీకరించారు. కేవలం వెజ్ ఫుడ్ మాత్రమే ఎందుకు వండుతున్నారనే విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమివ్వడానికి వార్డెన్ మెస్ వద్ద ఉండవలసిందిగా కోరారు. ఈ ప్రతిపాదనకు వార్డెన్ కూడా అంగీకరించలేదు. కోడి మాంసం సరఫరాదారుని బెదిరించి పంపించివేస్తున్నప్పుడు చోటు చేసుకున్న ఘటనలో సహాయం చేయమని కావేరీ విద్యార్థులు అభ్యర్థించినప్పటికీ, ఏ వార్డెన్ కూడా సంఘటనపై జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించలేదని పేర్కొంది.
విషయాలు చాలా హింసాత్మకంగా మారడానికి ముందే దీనికి సంబంధించిన సమాచారం అడ్మినిస్ట్రేషన్ కు తెలిసింది. అయినా అధికారులెవరూ జోక్యం చేసుకోలేదు. అందువల్ల, పరిపాలన విభాగం విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన తప్పుడు వాదనలతో నిండి ఉంది. దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కావేరీ హాస్టల్ నిర్వాహకులుగా వార్డెన్ల విశ్వసనీయత కోల్పోయారని హాస్టల్ కమిటీ, మెస్ కమిటీ పేర్కొంది. హాస్టల్లో అనేక మంది శారీరక వికలాంగ విద్యార్థులు కూడా ఉన్నారని తెలిపింది. పరిపాలనా అసమర్థత వల్లనో, చిత్తశుద్ధి లోపం వల్లనో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు సంకేతమని విమర్శించింది.