Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులకు అనేక సవాళ్లు
- వేతనాల్లో కోత, పెనాల్టీలు
- పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వదిలేస్తున్నారు : లింక్డిన్ నివేదిక
న్యూఢిల్లీ : భారత్లో మహిళా ఉద్యోగులు పని ప్రదేశాల్లో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని, చేస్తున్న ఉద్యోగం పట్ల విసిగి వేసారిపోయిన అనేకమంది మహిళలు ఉద్యోగాల్ని వదిలేస్తున్నారని 'లింక్డిన్' తాజా నివేదిక వెల్లడించింది. ఉద్యోగాన్ని కొనసాగించటంలో అననుకూలత, వేతనాల్లో కోతలు, యాజమాన్యాల పక్షపాత వైఖరి, పెనాల్టీలు.. మహిళా ఉద్యోగుల్ని తీవ్రంగా వేధిస్తున్నాయని నివేదిక పేర్కొన్నది. ప్రపంచంలో ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన 'లింక్డిన్' భారత్లో 2266మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదిక విడుదల చేసింది. మనదేశంలో ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పట్ల యాజమాన్యాల వైఖరి సరిగా లేదని, దాంతో ఉద్యోగ జీవితంలో మహిళలకు అనేక ఆటంకాలు వస్తున్నాయని నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి..
పని ప్రదేశాల్లో వివక్ష తీవ్రస్థాయిలో ఉందని, ఉద్యోగాల నుంచి తొలగిస్తారేమోననే భయంతో పనిచేస్తున్నామని అనేకమంది చెప్పారు. ప్రమోషన్లు లేకపోవటం, ఎక్కువ పని గంటలు డ్యూటీ ఉండటం, వేతనాల్లో కోతలు, సీనియర్స్ నుంచి వివక్ష..ఇవన్నీ అత్యధికశాతం మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నాయి.
కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రతి 10మంది మహిళా ఉద్యోగుల్లో 8మంది మెరుగైన ఉద్యోగం వెతుక్కోవాలని భావించారు. పని ప్రదేశాల్లో తమకు అనుకూలత లేదనే కారణంతో దాదాపు 70శాతం మంది తాము చేస్తున్న ఉద్యోగాల్ని వదిలేశారు. వ్యక్తిగత జీవితానికి, ఉద్యోగ జీవితానికి మధ్య సమతుల్యం, ఉద్యోగ జీవితంలో పురోభివృద్ధి..అనేవి ఆశిస్తున్నామని సర్వేలో పాల్లొన్న పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు. అయితే యాజమాన్యాల పక్షపాత వైఖరి తీవ్రస్థాయిలో ఉందని, అందువల్ల పెనాల్టీలు భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాల్లో కోత విధిస్తున్నారని ప్రతి 10మందిలో 9మంది మహిళలు చెప్పారు. సరైన పని పరిస్థితులు కల్పించాల్సిందిగా కోరగా ప్రతి 5మందిలో ఇద్దరు తిరస్కరణకు గురయ్యారు.