Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ సారి కూడా ప్రదానం చేయని మోడీ సర్కారు
- కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇదే తీరు
- ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు
న్యూఢిల్లీ : భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవం సదర్భంగా ఆయన పేరు మీదుగా ఇచ్చే అవార్డులను ఈ ఏడాది కూడా కేంద్రం ప్రదానం చేయడం లేదు. 2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కేంద్రం ఇదే వైఖరిని అవలంభిస్తున్నది. దీంతో ఆయన పేరు మీద అవార్డులు ప్రదానం చేయకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డాక్టర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును 1992లో, డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డును 1995లో ఏర్పాటు చేశారు. నేషనల్ అవార్డుకు రూ. 10 లక్షలు, అంతర్జాతీయ అవార్డుకు రూ. 15 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది. అంబేద్కర్ ఆలోచనలకు సరితూగే పనులు జరిపిన వ్యక్తులు, సంస్థలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభిస్తాయి. ఈ అవార్డులను అంబేద్కర్ ఫౌండేషన్ ప్రతి ఏడాదీ అంబేద్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14న అందజేస్తుంది. అయితే, కొన్ని ''అడ్మినిస్ట్రేటివ్'' కారణాలతో ఈ ఏడాది అవార్డుల ప్రదానం ఉండదని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ డైరెక్టర్ వికాస్ త్రివేదీ తెలిపారు. 2015 నుంచి అవార్డులను ఇవ్వకపోవడానికి ఇదే కారణాన్ని చూపుతుండటం గమనార్హం. అదేవిధంగా, 2001 నుంచి అంతర్జాతీయ అవార్డు ప్రదానం జరగకపోవడం, అంబేద్కర్ ఫౌండేషన్‌కు ఇదే కారణాన్ని తెలియజేయడం గమనించాల్సిన అంశం. ఇదిలా ఉండగా, అవార్డు విన్నర్స్ నామినేషన్స్ కోసం మార్చి రెండో వారంలో పిలుపునివ్వడం, ఇందుకు 15 రోజుల సమయాన్నే కేటాయించడం గమనార్హం. అలాగే, ఇటు అంతర్జాతీయ అవార్డుల విషయంలోనూ సాధారణానికి భిన్నంగా పేర్ల నమోదుకు మార్చి 9న పిలుపునిచ్చారు.
ఇక ఈ ఏడాది అవార్డులను ప్రదానం చేయకపోవడానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర సామాజిక న్యాయ సాదికార మంత్రిత్వ శాఖ కానీ, లేదా సంబంధిత ఇతర మంత్రిత్వ శాఖ కానీ తమ వెబ్సైట్లో పొందుపర్చకపోవడం గమనార్హం. త్రివేదీతో పాటు విలేకరులకూ అవార్డుల ప్రదానం రద్దుకు సంబంధించిన సమాచారాన్ని పొందటం కష్టంగా మారింది.
కాగా, 30 ఏండ్ల చరిత్రలో అంబేద్కర్ నేషనల్ అవార్డు ప్రదానం ఏడు సార్లే జరిగింది. అలాగే, అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు ప్రదానం రెండు సార్లు మాత్రమే జరగటం గమనార్హం. అయితే, రాజకీయంగా, ఎన్నికల్లో లబ్దిపొందేందుకు అంబేద్కర్ పేరును వాడుకొనే రాజకీయపార్టీలు.. ఆయన పేరు మీద ఇచ్చే అవార్డుల ప్రదానోత్సవాన్ని తరచూ రద్దు చేయడంపై ఎందుకు ప్రశ్నించటం లేదని సామాజికవేత్తలు, పౌర సంఘాల నాయకులు ప్రశ్నించారు.