Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత ఏకీకరణ కోసం తెరపైకి హిందీ భాష
- ఎన్నికల్లో వాడుకునేందుకు మోడీ సర్కార్ కొత్త ఎత్తుగడ
- ఉత్తరాది రాష్ట్రాల్లో ఫలించిన గోసంరక్షణ, శాఖాహారం
- కర్నాటకలో హిజాబ్ వివాదానికి తెరలేపిన పాలకులు
- ఇప్పుడు కొత్తగా.. ఇంగ్లీష్ వద్దంటూ వివాదం!
- తీవ్ర దుమారం రేపుతున్న అమిత్ షా వ్యాఖ్యలు
ఇంగ్లీష్ వద్దు..హిందీ ముద్దు. భారతీయులు ప్రతిచోటా హిందీ భాషలోనే మాట్లాడుకోవాలి...అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోసంరక్షణ పేరుతో, వస్త్రధారణ (హిజాబ్), పండుగల పేరుతో అనేక రాష్ట్రాల్లో బీజేపీ చిచ్చు రాజేస్తోంది. హిందీ భాష పేరుతో మోడీ సర్కార్ పెడుతున్న చిచ్చూ.. అలాంటిదేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాంసాహారం తిన్నారని 'జేఎన్‌యూ'లో ఏబీవీపీ కార్యకర్తలు చేసిన రగడ అంతా ఇంతా కాదు. ఎంతోమంది విద్యార్థుల తలలు పగలగొట్టారు. హిందూత్వ ఎజెండాను బలోపేతం చేయడానికి పాలకులు ఇప్పుడు హిందీ భాషను ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు.
న్యూఢిల్లీ : అధికార భాషా వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమ య్యాయి. ఇంగ్లీష్ స్థానంలోకి హిందీని తేవాలి, వేరు వేరు భాషలకు చెందిన భారతీయులు కలుసుకున్నప్పుడు ఇంగ్లీష్‌లో కాకుండా.. హిందీలోనే మాట్లాడుకోవాలి..అని తన ప్రసంగంలో అమిత్ షా చెప్పారు. అమిత్ షా హిందీ వాదన కొత్తదేమీ కాదు. ఒకసారి 'హిందీ దివస్' సందర్భంగా కూడా ఇటువంటి మాటలే మాట్లాడారు. అమిత్ షా తాజాగా రేపిన వివాదానికి వెంటనే తీవ్ర ప్రతి స్పందన వెలువడింది. దీనిని సాంస్కృతిక ఉగ్రవాదం..అని కర్నాటక ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. హిందీని రుద్దితే తీవ్రంగా వ్యతిరేకిస్తామని బెంగాల్ సీఎం మమతా బెనెర్జీ హెచ్చరించారు. మూడు భాషల సూత్రాన్ని తాము అంగీకరించమని,హిందీని జాతీయ అధికార భాష చేస్తే ఆమోదించబో మని తమిళనాడు స్పష్టం చేసింది. పెట్రోల్ ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం..వంటి సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి అమిత్ షా ఈ వివాదాన్ని రాజేశారనే అనుమానాలున్నాయి.
ఎన్నికల పోలరైజేషన్
భిన్నమైన భాషలు, సంస్కృతీ, సాంప్రదాయాలు, ఆచారాలున్న దేశంలో కొత్త వాదనను తెరమీదకు తీసుకురావటం వెనుక ఏముంది? హిందూత్వ ఎజెండాలో హిందీ భాషను బీజేపీ ఒక ఆయుధంగా మలుచుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 'హిందూత్వ పోలరైజేషన్'తో ఎన్నికల్లో లబ్దిపొందాలనే వ్యూహం ఉందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. తద్వారా కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో సుదర్ఘీకాలం అధికారం చెలాయించవచ్చన్నది మోడీ సర్కార్ ఎత్తుగడగా కనపడుతోంది. యధాలాపంగా అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేసుంటారని కొట్టిపారేయడానికి లేదు. 2024 సార్వత్రిక ఎన్నికలకు హిందీ భాష అంశాన్ని సిద్ధం చేయాలనేది బీజేపీ వ్యూహంగా కనపడుతోంది. ఐదేండ్ల క్రితం హిందీ రాష్ట్రాల్లో గోసంరక్షణ..అనే అంశాన్ని ప్రజల్లోకి బీజేపీ పెద్ద ఎత్తున తీసుకెళ్లింది. ఆ తర్వాత గోమాంసం తీనే వాళ్లను, అమ్మేవాళ్లను టార్గెట్ చేసింది. హిందీ రాష్ట్రాల్లో అనేక చోట్ల మటన్ దుకాణాలపై దాడుల జరిగాయి. బీజేపీ అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ..గోసంరక్షణ, శాఖాహారంపై పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఢిల్లీలో ప్రఖ్యాత వర్సిటీ జేఎన్‌యూలో విద్యార్థుల ఘర్షణకు దారితీసిన అంశమూ ఇదే. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుల్ని, కార్యకర్తల్ని తలలు పగిలేలా కొట్టారు. ఆహారం, వస్త్రధారణ పేరుతో హిందువుల్ని ఎలాగైతే బీజేపీ ప్రభావితం చేస్తుందో, అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి హిందీ భాష పేరుతో ఉత్తరాదిన కోట్లాది మందిని ప్రభావితం చేయాలనేది బీజేపీ వ్యూహంగా కనపడుతోంది.
ఇంగ్లీష్ వద్దంటే ఎలా?
ఇంగ్లీష్ అనుసంధాన భాషగా ఉండటం వల్ల భారతదేశంలో ఏ ఒక్క ప్రాంతానికీ అదనపు ప్రయోజనం లేదని బీజేపీ వాదన. అంతేగాక ఇప్పుడు ఇంగ్లీష్ ఉపాధి భాషగా, అవకాశాల భాషగా, అంతర్జాతీయ భాషగా ఉన్నప్పుడు దానిని ఎందుకు వదులుకోవాలి? ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ద్వారా ఏర్పడుతున్న సాధికారతను ఎందుకు వదులుకోవాలి? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. అనుసంధాన భాషగా ఇంగ్లీష్ అనేక సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇప్పుడిదంతా మార్చేసి..'ఒక దేశం, ఒకే భాష' అనే దిశగా కదలాలని అమిత్ షా చెప్పటం వింతగా తోస్తోంది. మనదేశంలో ఇంగ్లీష్ భాష ప్రాముఖ్యత చాలా ఉంది. ఏ చిన్న ఉద్యోగం సంపాదించాలన్నా..ఆంగ్ల భాషా నైపుణ్యం తప్పనిసరి.అంతేగాక ప్రస్తుత కంప్యూటర్ యుగం లో..కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవాలన్నా..ఇంగ్లీషే వారధి. కాల్‌సెంటర్, టీచింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మేంట్..ఏ రంగంలోకి వెళ్లాలన్నా ఇంగ్లీషే కావాలి.దుబారు,సౌదీ,అమెరికా,బ్రిటన్, కెనెడా, ఆస్ట్రేలియాలలో ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి. ఇవన్నీ మనకు కావాలంటే..మన స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియా తప్పనిసరి చేస్తున్నారు. ఇదంతా వదిలేసి ఇంగ్లీష్ స్థానంలో హిందీ తీసుకురావాలని మోడీ సర్కా ర్ చెప్పడం ఓట్లు రాల్చుకోవడానికేనన్న అభిప్రాయం వెల్లడవుతోంది.