Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సమస్యలకు పరిష్కారం చూపలేక ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు
- పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమం బలోపేతం
- గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యలపై ఉద్యమం
- తనతో కేసీఆర్ చాలాసార్లు రాజకీయాలపై చర్చించారు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ విధానాలకు ప్రత్యామ్నాయంగా.. 'ప్రత్యామ్నాయ విధాన కార్యక్రమం' ఆధారంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఏకంచేస్తామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. దీని ఆధారంగా ప్రజా పోరాటాలకు పదును పెడతామనీ, అదే సమయంలో హిందూత్వ మతవాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తుల విస్తృత సమీకరణకు పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి బుధవారం మాట్లాడారు. పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాన్ని బలపరిచేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు.
'దేశంలో నిరుద్యోగం పెరిగింది. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ప్రజా సమస్యలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పరిష్కారం చూపెట్టకుండా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చ గొడుతున్నది' అని ఏచూరి విమర్శించారు.
'తనతో కెసిఆర్ చాలాసార్లు రాజకీయాంశాలపై చర్చించారు. గతంలోనూ, సీపీఐ(ఎం) మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిశాం. ప్రస్తుతం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ తీసుకుంటున్న వైఖరి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే, దాన్ని రాజ్యాంగ పరిరక్షణకు ఉపయోగిస్తాం. అలాగే ఆయన వైఖరి స్పష్టం కావాలి. ధాన్యం కొనుగోలు చాలా ముఖ్యమైన అంశం'' అని తెలిపారు.
'జాతీయ స్థాయిలో ఫ్రంట్, కూటములు ఏర్పాటు ఇప్పుడు సాధ్యం కాదు. కేవలం రాష్ట్రస్థాయిలోనే సాధ్యమవుతుంది. ఎన్నికల ముందు ఏ కూటమి ఇప్పటివరకు ఏర్పాటుకాలేదు. ఎన్నికల తర్వాతే ఏర్పడుతుంది. బీజేపీకి వ్యతిరేకంగా అందరితో కలిసి ముందుకు వెళ్లేందుకు మేం సహకరిస్తాం' అని తెలిపారు. 'మతోన్మాద రాజకీయాలు ముందుకు తీసుకువచ్చి, ప్రజా సమస్యలను వెనక్కి నెడుతున్నారు. మతం ఆధారంగా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి, దాని ఆధారంగా బీజేపీ ఓట్లు సంపాదిస్తున్నది' అని ఏచూరి విమర్శించారు.
బీజేపీని ఓడించాలనే సంకల్పంతో వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులతో ప్రత్యామ్నాయ విధాన కార్యక్రమంతో విస్తృత లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కోసం సీపీఐ(ఎం) మాట్లాడుతోందని అన్నారు. ఈ ప్రయత్నం తప్పనిసరిగా ఎన్నికల పొత్తు, ఎన్నికల సీట్ల పంపకం అవగాహనకు దారితీయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసేందుకు అన్ని శక్తులను సమీకరిస్తామని అన్నారు. వామపక్ష శక్తుల ఐక్యతను బలోపేతం చేయాలనీ, ప్రత్యామ్నాయ విధాన కార్యక్రమం ఆధారంగా వామపక్ష, ప్రజాతంత్ర ఫ్రంట్‌ను రూపొందించాలని పార్టీ మహాసభ నిర్ణయించినట్టు చెప్పారు. పాలక వర్గాల విధానాలకు ప్రజల పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు. అదే సమయంలో హిందూత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తుల విస్తృత సమీకరణకు సీపీఐ(ఎం) కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ అందులో భాగమవుతుందా? అని అడిగిన ప్రశ్నకు ''వారు ఏమి చేస్తారో అది కాంగ్రెస్ ఇష్టం'' అని ఏచూరి బదులిచ్చారు.
''ఫెడరలిజం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణపై మూడు ముఖ్యమైన సెమినార్ల కోసం కాంగ్రెస్‌ను మేము ఆహ్వానించాం. దేశం కోసం ఇవే ముఖ్యమైన సమస్యలని మేం చెప్పాము. కాబట్టి రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న వారందరూ కలిసి రావాలని కోరాం. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ కలిసి రాలేదు. సెమినార్లలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు'' అని ఆయన అన్నారు. ''అందుకు వారే సమాధానం చెప్పాలి. మేం మా ఎన్నికల రాజకీయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. దేశం, రాజ్యాంగం, ప్రజలు ఈ మూడింటినే ఈ రోజు అత్యంత ముఖ్యమైన అంశాలని మేము చెబుతున్నాం'' అని ఏచూరి అన్నారు.
పార్టీ 23వ మహాసభ విజయవంతం
తమ పార్టీ 23వ మహాసభలు కేరళలోని కన్నూర్‌లో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఐదు రోజుల పాటు విజయవంతంగా జరిగాయని అన్నారు. పార్టీ మహాసభ 85 మంది సభ్యుల కేంద్ర కమిటీని ఎన్నుకుందని, తనను ప్రధాన కార్యదర్శిగా, 17 మందితో పొలిట్ బ్యూరోను ఎన్నుకుందని తెలిపారు. భారీ బహిరంగ సభ, భారీ రెడ్ షర్ట్ వాలంటీర్ల మార్చ్‌తో మహాసభ ముగిసిందన్నారు. భారీ మార్చ్, బహిరంగ సభ కేరళ ప్రజలతో సీపీఐ(ఎం)కు ఉన్న లోతైన మూలాలకు ఇది నిదర్శనమని తెలిపారు.
అన్ని స్థాయిల్లో మతతత్వం, రాజకీయ, సైద్ధాంతిక, సామాజిక, సాంస్కృతికతో పాటు వివిధ అత్యవసర సమస్యలపై 22 తీర్మానాలు ఆమోదించినట్టు వెల్లడించారు. రాజకీయ ముసాయిదా తీర్మానంపై దేశవ్యాప్తంగా పార్టీ సభ్యులు పంపిన 4,001 సవరణలు మహాసభ ముందు వచ్చాయనీ, అదనంగా మహాసభకు హాజరైన ప్రతినిధులు 390 సవరణలు, 12 సూచనలు చేశారని తెలిపారు. మహాసభ వీటన్నింటినీ పరిశీలించి, ఆమోదించిందని, సవరణలను చేర్చడం ద్వారా ముసాయిదా తీర్మానం సుసంపన్నం అయిందని తెలిపారు.
పార్టీ మహాసభ తన రాజకీయ తీర్మానం ద్వారా స్పష్టమైన వైఖరిని తీసుకుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఫాసిస్ట్ ఆరెస్సెస్ హిందూత్వ మతపరమైన ఎజెండాను దూకుడుగా ముందుకు తీసుకువెళుతోందని అన్నారు. అదే సమయంలో బీజేపీ ప్రభుత్వం బహుముఖ దాడికి దిగిందని విమర్శించారు. క్రూరమైన నయా ఉదారవాద సంస్కరణల సాధన ద్వారా మత-కార్పొరేట్ బంధాన్ని బలోపేతం చేయడం, జాతీయ ఆస్తులను కొల్లగొట్టడం, ఆశ్రిత పెట్టుబడిదారులను ప్రోత్సహించడం, పెట్టుబడిదారీ విధానం, రాజకీయ అవినీతిని చట్టబద్దం చేయడం, పూర్తి స్థాయి నిరంకుశత్వం ప్రదర్శించడం వంటి వాటికి బీజేపీ పాల్పడుతుందని మహాసభ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అందుకే 'బీజేపీని ఒంటరి చేయడం, ఓడించడం'' తమ ప్రధాన కర్తవ్యమని మహాసభ నొక్కి చెప్పిందని అన్నారు. బీజేపీని ఏకాకిని చేసి ఓడించే లక్ష్యం నెరవేరాలంటే, సీపీఐ(ఎం) స్వతంత్ర బలం గణనీయంగా పెరగడం, దాని రాజకీయ జోక్య సామర్థ్యాన్ని మరింతంగా ఉండేలా చేయడం అత్యవసరమని మహాసభ పేర్కొన్నట్టు ఏచూరి వివరించారు. పార్టీ మహాసభ రాజకీయ నిర్మాణ నివేదికలో వివిధ రాజకీయ నిర్మాణ అంశాలపై నిర్ణయం తీసుకుందనీ, ఆమోదించిందని తెలిపారు. మహాసభ అమోదించిన వాటిని పార్టీ అమలు చేస్తుందని అన్నారు. పార్టీ మహాసభ ప్రజల ఐక్యతను బలోపేతం చేయాలనీ, హిందూత్వ సవాళ్లను ఎదుర్కోవాలని నిర్ణయించిందని తెలిపారు.
దేశ లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించేందుకు దేశభక్తులంతా కలిసి రావాలని పార్టీ మహాసభ విజ్ఞప్తి చేసిందన్నారు. ఇది దేశ రిపబ్లిక్, రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చిన ప్రజల హక్కులను పరిరక్షిస్తుందని అన్నారు. హిందూత్వ మతోన్మాద శక్తులచే దాడి, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలపై పార్టీ మహాసభ స్పష్టం చేసిందన్నారు.