Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ప్రకటనపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ లేఖను మూడు వారాలుగా చదవలేదని విమర్శించింది. ఈ మేరకు గురువారం ఎస్కేఎం నేతలు దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ (కాక్కా జీ), యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఎంఎస్పీపై ప్రతిపాదిత కమిటీకి సంబంధించి ఎస్ కెఎం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ఏమి చేస్తారు? ఎలా పని చేస్తారో? స్పష్టంగా తెలిసే వరకు కమిటీకి పేర్లు ఇవ్వడానికి ఎస్కేఎం నిరాకరించిందని తెలిపారు. ఎంఎస్పీపై కమిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఎస్కేఎం పేర్ల కోసం ఎదురు చూస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ చేసిన ప్రకటనపై సంయుక్త కిసాన్ మోర్చా ఆశ్చర్యం వ్యక్తం చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు, సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 24న తన సమాధానాన్ని పంపిందని, అది మార్చి 30న మళ్లీ పంపబడిందని అన్నారు. ఈ విషయంపై మోర్చా ఏప్రిల్ 1న పత్రికా ప్రకటన విడుదల చేసిందని, ఇది మీడియాలో కూడా చాలా చర్చనీయాంశమైందని పేర్కొన్నారు.