Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలోని ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్
- ఐదుగురు సజీవదహనం, గాయాలతో మరొకరు మృతి
- 13 మందికి తీవ్రగాయాలు
- ఐదుగురి పరిస్థితి విషమం
- బాధితులకు రూ.50 లక్షల పరిహారం
- తాత్కాలికంగా ఫ్యాక్టరీ మూసివేత
- రూ.కోటి పరిహారం ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏలూరు : ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని ఫోరస్ (పారాసిట్మాల్ కెమికల్ పౌడర్ తయారీ) కంపెనీలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్-4లో రియాక్టర్ పెలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఫ్యాక్టరీలో సుమారు వెయ్యి మంది కార్మికులు మూడు షిఫ్టులో ఎనిమిది గంటల చొప్పున పనిచేస్తున్నారు. ఆఖరిదైన మూడో షిఫ్టు రాత్రి పది గంటలకు ప్రారంభమైంది. ఈ షిప్టులో మొత్తం 150 మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. మొత్తం నాలుగు బ్లాకుల్లో వీరంతా పనిచేస్తున్న సమయంలో నాలుగో బ్లాకులోని రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ సమయంలో అక్కడ మొత్తం 18 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన బ్లాకుల్లో పనిచేస్తున్న కార్మికులు, వాచ్మెన్లు, గార్డులు అందరూ ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. మృతుల్లో నలుగురు బీహార్ వాసులున్నట్లు గుర్తించారు. బాధితులను మొదట నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రకి తరలించారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్టిఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుల్లో బీహార్‌కు చెందిన మనోజ్‌కుమార్(21), అబ్బుదాస్(27), కార్కర్ రవిదాస్(40), సువాజ్ రవిదాస్ (32) ఉన్నారు. అక్కిరెడ్డిగూడేనికి చెందిన బొప్పడి కిరణ్(31), రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి చెందిన ఊదరపాటి కృష్ణయ్య(34) ఉన్నారు. మృతులందరికీ వివాహమై భార్యాపిల్లలున్నారు.
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, క్షతగాత్రులకు రూ.రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా
ఘటనా స్ధలాన్ని స్ధానిక ఎంఎల్ఎ మేకా వెంకటప్రతాప్ అప్పారావు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో పాటు ఏలూరు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్నవెంకటేష్, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు పరిశీలించారు. ఆనంతరం భాదితకుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, ఫోరస్ కంపెనీ యాజమాన్యం తరపున మరో రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకూ వైద్యం నిమిత్తం ఆందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) ఏపీ ఆందోళన
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం), ఇతర వామపక్ష, ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. బాధితులకు రూ.కోటి వరకూ నష్టపరిహారం ఆందించి, వారి కుటంబాలను ఆదుకోవాలని సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యలు సిహెచ్.బాబురావు, తదితరులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా సీపీఐ(ఎం) సభ్యలు పిల్లి రామకృష్ణ, పిల్లి మురళీ, ఎన్.నరసింహాలు మాట్లాడుతూ ఇలాంటి ప్రాణహాని ఉన్న కంపెనీలను గ్రామాలకు దూరంగా తరలించాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బృందంతో కూడిన అధికారులతో చర్యలు తీసుకోవాలన్నారు.
తాత్కాలికంగా ఫ్యాక్టరీ మూసివేత : కలెక్టర్ ప్రసన్నవెంకటేష్
ఈ ఘటన నేపథ్యంలో ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ ప్రకటించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని, అప్పటి వరకూ ఫ్యాక్టరీని తెరిచేదిక లేదని ఆయన స్పష్టం చేశారు.
కలెక్టర్, ఎస్పీపరిశీలిన
ఏలూరు పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద స్థలాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఫ్యాక్టరీ యాజమాన్యం, పనిచేస్తున్న కార్మికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో ఎటువంటి ముడి పదార్థాలు తయారవుతున్నాయన్న దానిపై అనుమానాలు వ్యక్తం చేశారు. పాలిమర్ ప్లాస్టిక్ ఉపయోగించే ముడి పదార్థమే కాకుండా ఇతర ముడి పదార్థాలు కూడా తయారవుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. రాత్రి ప్రమాదం జరిగిన తర్వాత ఫ్యాక్టరీ లోపలకి ఎవరినీ అనుమతించకుండా గేట్లు మూసివేయడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ... ఫ్యాక్టరీ బయట అక్కిరెడ్డిగూడెం గ్రామస్థులు ఆందోళనకు దిగారు.