Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ కు ఏచూరి నివాళి
న్యూఢిల్లీ : దేశ రాజ్యాంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడికి పూనుకుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం నాడిక్కడ పార్లమెంట్ వద్ద డీఎస్ఎంఎం ఆధ్వర్యంలో ''రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి'' అనే నినాదంపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను స్మరించుకునే కార్యక్రమంలో సీతారాం ఏచూరి పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించేందుకు తామంతా ఇక్కడికి వచ్చామని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం కోసం పోరాటాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగం, దానికి ఉన్న నాలుగు ప్రధాన స్తంభాలపై దాడి జరుగుతోందని పేర్కొన్నారు. లౌకిక ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమాఖ్యవాదం, ఆర్థిక సార్వభౌమాధికారం వంటి నాలుగు స్తంభాలపైనా దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ దాడికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలని అన్నారు. దేశాన్ని హిందూ రాష్ట్రగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని, దాన్ని తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఎంఎం నేత నత్తు ప్రసాద్, ఐద్వా అధ్యక్షురాలు మెమునా మొల్లా పాల్గొన్నారు.