Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదుపు తప్పిన ధరలు.. ముడి సరుకు కొరత
- తమిళనాడులో తయారీదారుల 12 రోజుల నిరసన
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలోని అగ్గిపెట్టె పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అదుపు తప్పి ధరలు, ముడి సరకు కొరత ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నాయి. దీంతో కార్మికులు కూడా తీవ్ర కష్టాలను అనుభవిస్తున్నారు. తమిళనాడు అగ్గిపెట్టెల తయారీదారుల అసోసియేషన్ ఈనెల 6 నుంచి 12 రోజుల సుదీర్ఘ ఆందోళనను కొనసాగిస్తున్నది. ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలపై తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలనే డిమాండ్‌తో అసోసియేషన్ ఈ నిరసనకు దిగింది. కొనసాగుతున్న ధరలు, ముడి సరుకు కొరత ఈ పరిశ్రమను కష్టాల్లోకి నెట్టింది. కార్డ్‌బోర్డు, వ్యాక్స్, పొటాష్ వంటి ముడి సరుకు ధరల్లో పెరుగుదలలు ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో దాదాపు 15 ఏండ్ల తర్వాత అగ్గిపెట్టెల ధరలు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తమిళనాడు స్మాల్ ఇండిస్టీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
(ఎస్ఐడీసీఓ) ద్వారా కార్డు బోర్డు సరఫరాను, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) ల ద్వారా వ్యాక్స్‌ను సరఫరా చేయాలన్న చర్యలను తయారీదారుల అసోసియేషన్ ముందుంచింది. కార్మికులకు తగిన పరిహారం అందించాలని కార్మికుల ట్రేడ్ యూనియన్ డిమాండ్ చేసింది. అలాగే, సంక్షోభం నుంచి ఈ పరిశ్రమను బయటపడేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని తెలిపింది.
60 నుంచి 140 శాతం పెరిగిన ముడిసరుకు ధరలు
మహమ్మారి సంక్షోభం నుంచి ముడి సరుకుల ధరల్లో పెరుగుదల కనిపించింది. కార్డుబోర్డులు, వ్యాక్స్, రెడ్ పాస్పరస్, సల్ఫర్, బ్ల్యూ మ్యాచ్ పేపర్స్ ధరలు క్రమంగా పెరిగాయి. దాదాపు 350 సెమీ-ఆటోమేటేడ్, పూర్తి ఆటోమేటేడ్ యూనిట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రెండు లక్షల మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా, తూత్తుకుడి, విరుధునగర్ జిల్లాల్లో ఈ పరిశ్రమ ఉపాధికి కీలకంగా ఉన్నది. '' ముడి సరుకు ధరలు కోవిడ్-19 మహమ్మారి నుంచి పెరిగాయి. అన్ని పరిశ్రమల కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ ధరల పెరుగుదల కొనసాగింది. ఈ పెరుగుదల 60 శాతం నుంచి 140 శాతం ఉన్నది'' అని తమిళనాడు అగ్గిపెట్టెల తయారీ దారుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. లక్ష్మణన్ తెలిపారు.
రెండు లక్షల మందికి ఉపాధి.. 90 శాతం మంది మహిళలే..!
గతేడాది డిసెంబర్ నుంచి అగ్గిపెట్టెల ధరలు రూ. 1 నుంచి రూ. 2కు పెరిగాయి. 14 ఏండ్ల విరామం తర్వాత ఈ ధరలు పెరగడం గమనించాల్సిన అంశం. అగ్గిపెట్టె పరిశ్రమ విలువ దాదాపు రూ. 2000 కోట్లుగా ఉన్నది. ఈ పరిశ్రమకు తమిళనాడు హబ్‌గా ఉన్నది. ఈ పరిశ్రమను నమ్ముకొని దాదాపు రెండు లక్షల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని తప్పించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తప్పనిసరని విశ్లేషకులు సూచించారు.