Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదు రాష్ట్రాల ఎన్నికల విజయంతో రాజకీయంగా తమకు తిరుగులేదని మోడీ సర్కార్ భావిస్తోంది. కఠినమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టాలని, ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మోడీ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నోట్లరద్దు, జీఎస్టీ, కఠినమైన లాక్డౌన్ విధింపు..ఇలాంటి నిర్ణయాలు దేశ ఆర్థికరంగాన్ని ఎంతలా అతలాకుతలం చేశాయో అందరికీ తెలుసు. సంస్కరణల పేరుతో ప్రస్తుతం కేంద్రం చేపడుతున్న బ్యాంకుల ప్రయివేటీకరణ కూడా దేశాన్ని అల్లకల్లోలం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
- సంస్కరణలకు తెరలేపిన మోడీ సర్కార్
- రెండు ప్రభుత్వ బ్యాంకుల్ని అమ్మేందుకు ఏర్పాట్లు!
- ఇలాంటి నిర్ణయం అశాస్త్రీయం, ప్రమాదకరం : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : ప్రయివేటీకరణ సర్వరోగ నివారిణి..అని 'నిటి ఆయోగ్' మాజీ వైస్ ఛైర్మెన్ అరవింద్ పనగారియా మోడీ సర్కార్కు సూచించారు. ప్రభుత్వరంగ సంస్థల్ని, బ్యాంకుల్ని వీలైనంత వేగంగా తెగనమ్మేయాలని ఆయన చెబుతున్నారు. అయితే నేడు మనదేశంలో బ్యాంకింగ్రంగంలో నెలకొన్న సమస్యలకు ప్రయివేటీకరణ పరిష్కారం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రయివేట్ బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోయి..కుప్పకూలితే అందులో ఖాతాదారుల సొమ్ముకు గ్యారెంటీ ఉండదు. దేశ ఆర్థిక వ్యవస్థ సైతం కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది.
గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, యెస్ బ్యాంక్..మూతపడినప్పుడు మొత్తం బ్యాంకింగ్రంగాన్నే అతలాకుతలం చేశాయి. మొత్తం బ్యాంకింగ్రంగంపైన్నే అపనమ్మకం ఏర్పడే పరిస్థితికి దారితీసింది. బ్యాంకుల ప్రయివేటీకరణతో మంచి ఫలితాలు రావని ఆర్థిక నిపుణులు, బ్యాంకు ఉద్యోగులు కేంద్రాన్ని ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారు. ప్రయివేటీకరణపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని బ్యాంకు సిబ్బంది ఇప్పటికే ప్రకటించారు.
విలువ కట్టలేం..
లాభనష్టాలే ప్రాతిపదికగా కార్పొరేట్ కంపెనీలు, ఇతర సంస్థలు నడుస్తాయి. నష్టాలు వస్తే ఆ కంపెనీ ఆస్తిపాస్తుల్ని అమ్మేస్తారు. యాజమాన్యం చేతులు దులుపుకుంటుంది. ఇదే పద్ధతిలో ఒక ప్రభుత్వ బ్యాంకును తెగనమ్మటం, మూసేయటం చేయలేమని 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) పాలసీ చెబుతోంది. అంతేకాదు మనదేశంలో ప్రభుత్వ బ్యాంకుల విలువ కేవలం..అక్కడున్న డబ్బుతో వచ్చింది కాదు. బ్యాంకింగ్ సేవలు, ప్రజల నమ్మకం, ప్రభుత్వం ఇచ్చే భరోసాతో వచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల మార్కెట్ క్యాపిటల్ కొన్ని లక్షల కోట్లలో ఉంటుందని అంచనా. వీటికి మోడీ సర్కార్ కొనుగోలుదార్లను తీసుకురాగలదా? అంటే..తీసుకురాలేదు. అయినప్పటికీ ఓ రెండు ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రయివేటుకు అమ్మేందుకు మోడీ సర్కార్ సిద్ధమవుతోంది.
ప్రజల సొమ్ము..
ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా ఈ దేశ ప్రజలదే. ఖాతాదార్ల డిపాజిట్లతో పోల్చితే షేర్ హోల్డర్స్ పెట్టుబడి చాలా స్వల్పం. పొదుపు, కరెంట్, ఇతర మార్గాల ద్వారా సేకరించిన మొత్తాల్ని వినియోగించి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అత్యంత ధనవంతులకు, బడా కార్పొరేట్లకు, వ్యాపారులకు ఇచ్చే రుణాలు మొండి బకాయిలుగా మారుతున్నాయి. ఇలా మారకుండా తగిన నియంత్రణ వ్యవస్థను అధికారంలో ఉన్న పాలకులే తీసుకురావాలి. వ్యక్తిగత రుణాల్లోనూ ఆదాయ ధ్రువీకరణ సరిగా చూసుకోవాలి. అందుకోసం వివిధ పద్ధతుల్లో సమాచారాన్ని సేకరించాలి. ఇలాంటి చర్యల వల్ల బ్యాంకుల మొండిబకాయిలు అడ్డుకోవచ్చు. పాలకులు చేయాల్సింది ఇదే. ఈ బాధ్యతను పక్కకుపెట్టి..మొత్తం బ్యాంకునే తెగనమ్మేస్తామంటూ నిర్ణయం తీసుకోవటం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు.
చరిత్ర ఏం చెబుతోంది?
ప్రయివేట్ బ్యాంకుల వైఫల్యాలు ఎంతటి చేదు ఫలితాల్సి ఇస్తుందో అనేక ఉదంతాలున్నాయి. ఆర్బీఐ ఏర్పాటయ్యాక..1935 నుంచి 1947 మధ్యకాలంలో 900 బ్యాంకులు దివాళా తీశాయి. 1947 నుంచి 1969 మధ్యకాలంలో 665 బ్యాంకులు మూతపడ్డాయి. ఈ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న ఖాతాదార్లంతా నష్టపోయారు. బ్యాంకుల జాతీయకరణ తర్వాత 36 బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోగా..అందులో ఖాతాదార్ల సొమ్ము ఎక్కడికీ పోలేదు. లక్ష్మీ విలాస్, యెస్ బ్యాంకు సంక్షోభాల్లో చిక్కుకోగా ఆర్బీఐ రంగంలోకి దిగి డిపాజిటర్లకు న్యాయం చేసింది. 'ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బ్యాంక్' అని భరోసా ఉన్నచోట అందులోని ఖాతాదార్లకు ఎనలేని భరోసా, నమ్మకం ఏర్పడుతుంది. ప్రయివేటీకరణతో ఇప్పుడీ వ్యవస్థ అంతా గందరగోళంగా మారే పరిస్థితి ఏర్పడింది.
అదొక్కటే కాదు..
నేడు మనదేశ ఆర్థిక పురోభివృద్ధిలో ప్రభుత్వ బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఒక సామాన్య వ్యక్తి వాహన రుణం తీసుకోవాలన్నా, స్వల్ప వడ్డీతో బంగారంపై రుణాలు తీసుకోవాలన్నా ముందుగా ప్రభుత్వ బ్యాంకుల్నే ఆశ్రయిస్తాడు. బ్యాంకుల జాతీయకరణ తర్వాతే సామాన్యులు అనేక మంది బ్యాంకు రుణాలు తీసుకోవటం పెరిగింది. అంతేకాదు నేడు ప్రభుత్వ బ్యాంకు శాఖలు మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు అవుతున్నాయి. లక్షల మంది యువతకు ఉపాధి కేంద్రంగా నిలుస్తున్నాయి. అనేక ప్రభుత్వ పథకాల అమలు బ్యాంకు ఖాతాతో ముడిపడి ఉంది. ఈనేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు, సేవల్ని, ఇతర పరిశ్రమలతో పోల్చి చూడరాదని నిపుణులు చెబుతున్నారు. మొండి బకాయిలు ఏర్పడుతున్నాయంటే..అలా జరగకుండా నియంత్రణ వ్యవస్థల్ని తీసుకురావాలని సూచిస్తున్నారు.