Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్‌యూ గేటు వద్ద కాషాయ జెండాలు
- పోలీసుల ఆదేశాలతో తొలగింపు
న్యూఢిల్లీ : రామనవమి ఘర్షణ తరువాత ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) ప్రధాన గేటు వద్ద హిందూ సేన శుక్రవారం కాషాయ జెండాలను ఎగురవేసింది. హిందూసేన కార్యకర్తలు జేఎన్‌యూ క్యాంపస్ చుట్టూ కాషాయ రంగు పోస్టర్లను అతికించింది. ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా జెఎన్‌యు హాస్టల్ లో నాన్ వెజ్ ఫుడ్ వడ్డించకుండా ఏబీవీపీ సభ్యులు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. నానాయాగీ చేసి హింసకు ఒడిగట్టారు. ఈ ఘటనపై జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. స్వతంత్ర న్యాయ విచారణ చేయాలని, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై జెఎన్‌యు అడ్మినిస్ట్రేషన్ నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థి సంఘాలు గళమెత్తాయి. ఈ ఘటనపై విచారణ మొదలవ్వక ముందే, కాషాయ మూకలు మరో ఘాతుకానికి పాల్పడ్డాయి. జేఎన్‌యూ గేటు వద్ద కాషాయ జెండాలు పెట్టి, పుండుపై కారం చల్లినట్టు చేశాయి. దీంతో జేఎన్‌యూపై సంఘపరివార్ కుట్రలు బట్టబయలు అయ్యాయి. జేఎన్‌యూపై ఉద్దేశపూర్వకంగానే సంఘపరివార్ దాడి చేస్తుందనడానికి హిందూ సేన ఘటనే ఉదాహరణ అని కొంత మంది విద్యార్థులు స్పష్టంచేశారు. ఇదిలాఉండగా జేఎన్‌యూ వద్ద హిందూ సేన ఏర్పాటుచేసిన కాషాయ రంగు జెండాలను తొలగించామని డీసీపీ సౌత్ వెస్ట్ మనోజ్ పేర్కొన్నారు. ఈ జెండాలు, పోస్టర్లు వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.