Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో ఇద్దరు ముస్లిం మైనర్లపై ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు ముస్లిం మైనర్లు పాకిస్తానీ పాటలు వింటున్నారని అక్కడి పోలీసులు కేసు పెట్టారు. మొబైల్ ఫోన్లో పాకిస్తానీ గీతాలు వింటున్నారని స్థానికుడు ఒకరు ఫిర్యాదు చేయగా..నయీం(16), ముస్తికీం(17)లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రంతా నిర్బంధించారు. వీరిద్దరూ బరేలీలోని సింఘై మూర్వానీ అనే గ్రామానికి చెందినవారు. పొరుగుదేశం పాకిస్తాన్ గురించి గొప్పగా వర్ణిస్తూ ఉన్న పాటల్ని మొబైల్ ఫోన్లలో వింటున్నారని ఆశీష్ అనే వ్యక్తి ముస్లిం యువకులతో బుధవారం గొడవకు దిగాడు. ఫోన్లో పాటల్ని వెంటనే ఆపేయాలని వారితో వాగ్వివాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకదాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
దీని గురించి స్థానిక వార్తా పత్రికల్లో కథనాలు రావటంతో చర్చనీయాంశమైంది. తమ పిల్లల్ని పోలీసులు అకారణంగా అరెస్టు చేసి రాత్రంతా స్టేషన్లో నిర్బంధించారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఉదంతంపై విచారణ జరుపుతున్నామని బరేలీ అడిషనల్ ఎస్పీ రాజ్‌కుమార్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. నయీం, ముస్తికీంలపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 153బి, 504, 506 కింద ఆరోపణలు నమోదుచేశారు.