Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, వియత్నాం అంగీకారం
- వియత్నాం కమ్యూనిస్టు పార్టీ నేతతో మోడీ ఫోన్లో చర్చలు
న్యూఢిల్లీ : ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పటిష్టపరచుకోవాలని భారత్, వియత్నాం నేతలు నిర్ణయించారు. భారత్, వియత్నాం దౌత్య సంబంధాల యాభయ్యో వార్షికోత్సవాల (జనవరి7, 1972 నుంచి జనవరి7,2022) సందర్భంగా సుహృద్భావ, స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం కావడం, ఇటీవల కాలంలో ప్రత్యేకించి కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో పరస్పర సహకారం పెంపొందడం, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టత పై ఇరువురు నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వియ త్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గుయెన్ ఫూ ట్రాంగ్తో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఉక్రెయిన్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం, దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితులపై కూడా వారు చర్చించారు. భారత్, వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద విస్తృత పరిధిలో సహకారం కొనసాగుతుండడం పట్ల ఇరువురు నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 2016లో వియత్నాంలో మోడీ పర్యటించిన సమయంలో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50ఏళ్లు అయిన సందర్భంగా పరస్పరం అభినందనలు తెలియచేసుకున్నారు. భారతదేశ ప్రాచ్య విధానానికి, ఇండో-పసిఫిక్ దార్శనికతకు కీలకమైన స్తంభంగా వియత్నాం నిలిచిందంటూ ప్రధాని మోడీ కొనియాడారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తరించుకోవాల్సి వుందని అన్నారు. ప్రస్తుతమున్న చొరవలపై మరింత వేగంగా పురోగతిని సాధించడం కోసం కృషి చేయాల్సి వుందని అన్నారు. వియత్నాంలో భారతదేశ ఫార్మా రంగానికి, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా మోడీ కోరారని పిఎంఓ కార్యాలయ ప్రకటన తెలిపింది. ఇరు దేశాల మధ్య చారిత్రక, నాగరిక సంబంధాల ప్రాముఖ్యతను మోడీ గుర్తు చేశారు. వియత్నాంలో చామ్ కట్టడాల పునరుద్ధరణలో భారతదేశ పాత్ర పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం పెంపునకు ఇరువురు నేతలు అంగీకరించారని పిఎంఓ తెలిపింది.