Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో కరోనా కేసులు స్వల్ప స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ఢిల్లీ, ఢిల్లీ-ఎన్సిఆర్, మహారాష్ట్రల్లో కేసులు పెరుగుతున్నాయి. అధిక వ్యాప్తి సామర్థ్యం కలిగిన ఒమిక్రాన్ ఎక్స్ఇ, బిఎ.2 వంటి వేరియంట్ల కారణంగానే కేసుల్లో స్వల్ప వృద్ధి కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో పాజిటివిటీ రేటు మళ్లీ 2 శాతం దాటగా.. వారం రోజుల్లోనే హౌం ఐసోలేషన్ కేసులు దాదాపు 48శాతం పెరిగాయి. ముఖ్యంగా పాఠశాలల్లో ఎక్కువగా కేసులు వెలుగు చూస్తుండటం కలవరపెడుతోంది. శుక్రవారం ఉదయానికి గత 24 గంటల్లో ఢిల్లీలో 325 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివిటీ రేటు 2.39 శాతానికి చేరింది. అదే సమయంలో హౌం ఐసోలేషన్ కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. గురువారం నాటికి ఈ కేసుల సంఖ్య 574కు చేరింది. అయితే మరణాలు నమోదు కాకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. వైరస్ వ్యాప్తిని అరికట్టే నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
మళ్లీ వెయికి దిగువన కేసులు
దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. శుక్రవారం ఉదయానికి గత 24 గంటల్లో 3,67,213 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 949 కేసులు వెలుగులోకి వచ్చాయి. గురువారం కరోనాతో ఆరుగురు మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,21,743కు చేరింది. అలాగే కొత్త కేసుల కంటే రికవరీలు కాస్త తక్కువగా ఉన్నాయి.