Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏక భాష వద్దు.. 'మాకు హిందీ తెలియదు'
- కేంద్ర హౌం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల ప్రముఖుల ఆగ్రహం
న్యూఢిల్లీ : భాషా పరమైన ఆధిపత్యాన్ని సహించమని వివిధ రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలనీ, స్థానిక భాషలను కాదని కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వివాదాస్పద ప్రకటన దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న వాదన తెరపైకి వచ్చింది. స్థానిక, ప్రాంతీయ అస్థిత్వంపై కేంద్ర ప్రభుత్వ దాడిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ భాషలను తక్కువ చేయడం, హిందీని ప్రోత్సహించడంపై వివిధ రాష్ట్రాల్లో ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు.గత వారం ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యకలాపాలు అధికార భాషలో ఉండాలని ప్రధాని మోడీ నిర్ణయించారనీ, ఇది కచ్చితంగా హిందీ ప్రాముఖ్యతను పెంచుతుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు హిందీని విస్తరించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.'వివిధ రాష్ట్రాల పౌరులు కమ్యూనికేట్ చేసేటప్పుడు అది దేశ భాషలో ఉండాలి. అదే సమయంలో ప్రాంతీయ భాషల నుంచి పదాలను ఇముడ్చుకునేందుకు అనువుగా హిందీని మార్చాలి' అని అమిత్ షా వ్యాఖ్యానించారు. హిందీ ఎక్కువగా మాట్లాడేవారు ఉంటే.. అది దేశాన్ని ఒక్కటిగా ఉంచుతుందన్న భావన కలుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 10వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ, కేరళ ,అసోం, బెంగాల్, కర్నాటక, తమిళనాడు, సహా పలు రాష్ట్రాల నాయకులు దీనిపై స్పందించారు. భాషా పరమైన ఆధిపత్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలను ఏకం చేసే పేరుతో హిందీని అందరిపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందీని బలవంతంగా రుద్దడం మానుకోవాలని హితవు పలికారు. స్థానిక భాషలను పరిరక్షించడం, ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసోం సాహిత్య సభ కోరింది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు బీజేపీ నేతలూ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఈ చర్య దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని డీఎంకే పేర్కొంది. భారతీయుడని నిరూపించుకోవడానికి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని తమిళనాడు బీజేపీ నేతలు అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా మోడీ సర్కారు చర్యను తప్పుబట్టింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్లో తన అభిప్రాయాన్ని తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ బలంగా గళం వినిపించారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రం తీరును తప్పు పట్టారు. హిందీని రుద్దడాన్ని వ్యతిరేకించారు. ఇది ఆర్ఎస్ఎస్ ప్రాజెక్టులో భాగమని పేర్కొన్నారు.
ఆ ప్రతిపాదన తగదు...
హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో స్టాప్ హిందీ ఇంపోజిషన్ (హిందీని రుద్దడాన్ని ఆపాలి) హాష్‌ట్యాగ్‌తో ప్రచారంలో వచ్చింది. 'నాకు హిందీ తెలియదు' అనేది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్, సిని నటుడు ప్రకాశ్ రాజ్ వంటి సెలబ్రిటీలు కూడా ట్విటర్ వేదికగా తమ నిరసన వ్యక్తం చేశారు.