Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క స్థానంలో కూడా గెలవని పరిస్థితి
- నాలుగు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల్లో పరాజయం
- కాంగ్రెస్-రెండు, ఆర్జేడీ-ఒక అసెంబ్లీ స్థానంలో గెలుపు
- అసన్సోల్లో శత్రుఘ్నసిన్హాకు భారీ మెజార్టీ
న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, బీహార్లలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది.
బీహార్‌లో అధికార ఎన్డీఎకు ఎదురుదెబ్బ తగిలింది. బోచహాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రతిపక్ష ఆర్జేడి విజయఢంకా మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి అమర్ కుమార్ పాశ్వాన్ 48.52 ఓట్ల శాతంతో 82,562 ఓట్లతో బీజేపీ అభ్యర్థి బేబీ కుమారి (45,909 ఓట్లు)పై 36,653 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి యశోదా నీలాంబర్ వర్మ (53.55 శాతం) 87,879 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కోమల్ జంఘెల్ (67,703 ఓట్లు)పై 20,176 ఓట్ల మెజార్టితో విజయం సాధించారు. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే జోరు కొనసాగించింది. కొల్లాపూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ జయశ్రీ చంద్రకాంత్ ఏకంగా 54.34 ఓట్ల శాతంతో 97,332 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి సత్యజీత్ కడమ్ (78,025 ఓట్లు)పై కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకాంత్ 19,307 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లోనూ గెలిచింది. బల్లిగుంగె అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నుంచి టీఎంసీలో చేరిన సింగర్ బాబూల్ సుప్రియో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అనూహ్యంగా రెండో స్థానంలోకి వచ్చింది. టీఎంసీ 49.69 శాతం, సీపీఐ(ఎం) అభ్యర్థి సైరా షా హలీమ్ 30.06 శాతం (30,971) ఓట్లు వచ్చాయి. బీజేపీ కేవలం 12.31 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇక అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి శత్రుఘన్ సిన్హా విజయం సాధించారు. ఇక్కడ సీపీఐ(ఎం) అభ్యర్థి పార్థ ముఖర్జీకి 90,412 ఓట్లు వచ్చాయి. గతంలో బీజేపీ నేత అయిన శత్రుఘన్ సిన్హా మొదట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అనంతరం కొద్ది రోజుల క్రితం టీఎంసీలో చేరారు.