Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదం, ద్వేషం, అసహనం దేశాన్ని చుట్టుముట్టాయి
- భయం, బెదిరింపులు, మోసం..మోడీ సర్కార్కు మూలస్తంభాలు : సోనియాగాంధీ
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ పాలనలో దేశాన్ని అసహనం, ద్వేషం, మతోన్మాదం చుట్టుముడుతున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగేందుకు అనుమతించకూడదని ఓ వార్తా పత్రికకు రాసిన సంపాదకీయంలో పేర్కొన్నారు. ''ద్వేషం, మతోన్మాదం, అసహనం, అసత్యం దేశాన్ని చుట్టుముట్టాయి. వీటిని ఇలాగే కొనసాగనివ్వకూడదు. దేశ ప్రజలుగా వీటిని మనం చూస్తూ ఉండిపోకూడదు. నకిలీ జాతీయవాదం కోసం మనదేశంలోని శాంతి, బహుళత్వాన్ని త్యాగం చేయకూడదు. నేడు దేశంలో వ్యాపించిన విద్వేషపు సునామీని అడ్డుకోవాలి'' అంటూ సోనియాగాంధీ రాసుకొచ్చారు. అధికారంలో ఉన్నవారికి అనుకూలమైన భావజాలం లేకపోతే..అణచివేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని..దేశ యంత్రాంగాన్ని వారిపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.
''సామాజిక కార్యకర్తలను బెదిరించి నోరుమూయిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. భయం, మోసం, బెదిరింపులే మోడీ సర్కార్కు మూలస్తంభాలుగా మారాయి'' అంటూ నిప్పులుచెరిగారు.కర్నాటకలో హిజాబ్ వివాదం, రామనవమి సందర్భంగా దేశంలో ఘర్షణలు, జేఎన్యూలో మాంసాహారంపై గొడవ వంటి అంశాలనూ తన ఆర్టికల్లో పరోక్షంగా సోనియాగాంధీ ప్రస్తావించారు. ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి..గొడవలు రేపుతున్నారంటూ మోడీ సర్కార్ తీరుపై ధ్వజమెత్తారు. ''దుస్తులు, విశ్వాసాలు, ఆహారం, పండగలు, భాష..ఇలా ఏ అంశమైనా దేశంలోని పౌరులను తమ తోటి పౌరులకు వ్యతిరేకంగా మారుస్తున్నారు. విద్వేసాన్ని రెచ్చగొట్టే శక్తులకు ప్రోత్సాహం లభిస్తోంది. గతంలో జరిగిన ఘటనలకు ఊహాగానాలు జోడించి...ప్రస్తుత పరిణామాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు''అని సోనియా పేర్కొన్నారు.