Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాజస్థాన్లోని కరౌలీలో కొద్దిరోజుల క్రితం జరిగిన మత ఘర్షణల్లో ముస్లీంల దుకాణ సముదాయాలు పెద్ద ఎత్తున విధ్వంసానికి గురయ్యాయని నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. ఏప్రిల్ 2నాటి ఘర్షణల్లో దాదాపు 62 దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, రూ.5కోట్లకుపైగా బాధితులకు ఆస్తి నష్టం వాటిల్లిందని కమిటీ అంచనావేసింది. కరౌలీ నగరంలో బూరా బాటాషా మార్కెట్లో తినుబండారాల దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. తినుబండారాలు కొనుగోలుచేయడానికి ప్రతిరోజూ ఇక్కడికి వేలసంఖ్యలో జనాలు వస్తుంటారు. ఈ ప్రాంతంలో దుకాణాలు ఎక్కువగా ముస్లింలు నడుపుతున్నవే ఉన్నాయి. ఏప్రిల్ 2న చోటుచేసుకున్న మత ఘర్షణలతో ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న దాడులు ఎంతోమంది జీవనోపాధిని దెబ్బతీశాయి. సామాజిక కార్యకర్త అమీర్ శేర్వానీ నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించింది. సామాజిక కార్యకర్త ఆసిఫ్ ముజ్తాబా, జర్నలిస్ట్ సయ్యద్ మీర్, అర్బాబ్, వాలంటీర్ డానిష్లు క్షేత్రస్థాయిలో పలువురు బాధితుల్ని కలుసుకొని మాట్లాడారు. అల్లర్ల కారణంగా 62 దుకాణా సముదాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, అంతేగాక..ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని దుకాణాలు నడుపుతున్న ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు.నగరంలో రెండు వర్గాల మధ్య ఎప్పుడూ లేనటువంటి వాతావరణం అక్కడ నెలకొందని కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో రెండు వర్గాలు ఎన్నో ఏండ్లుగా శాంతియుతంగా నివసిస్తు న్నారని, అయితే హిందూత్వ మూకలు ఈ ప్రాంతంలో చొరబడి కొద్ది రోజుల క్రితం దాడులకు తెగబడిందని కమిటీ మీడియాకు వెల్లడించింది.