Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణతో రూ.97వేల కోట్లు సేకరించిన కేంద్రం
- బొగ్గు తవ్వకం, రహదారులు, ఖనిజాలు, విద్యుత్..లలో ప్రభుత్వ ఆస్తులు అమ్మకం
- 2025నాటికి రూ.6లక్షల కోట్లు సేకరించాలని లక్ష్యం
- జాతీయ సంస్థల్ని అమ్మేందుకు బీజేపీకి అధికారమిచ్చారా : రాజకీయ విశ్లేషకులు
దేశ సంపద, వనరుల్ని విదేశీ కార్పొరేట్లకు అమ్మటం గొప్ప తెలివైన పనిగా మోడీ సర్కార్ భావిస్తోంది. బొగ్గు గనుల తవ్వకం, రైల్వేలు, రహదార్లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ..మొదలైన వాటిల్లో ఎక్కడ ప్రభుత్వ ఆస్తి, సంపద ఉన్నా దానికి 'ఫర్ సేల్' బోర్డ్ పెట్టేసింది. ఎన్ఎంపీ (జాతీయ నగదీకరణ) ప్రకటించిన కొద్ది నెలల్లో జాతీయ సంపద, వనరుల అమ్మకం ద్వారా రూ.97వేల కోట్లు సేకరించినట్టు తెలిసింది. దేశ సంపదను ఇలా అమ్మేస్తూ పోతే మన పరువు, గౌరవం ఏంగానూ? భారతదేశంపై విదేశీ కార్పొరేట్ శక్తుల పట్టు పెరగదా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ రెండోసారి అధికారం చేపట్టగానే చేసిన మొట్టమొదటి పని..దేశ సంపద, వనరుల్ని అమ్మేయాలని నిర్ణయించటం. కరోనా సంక్షోభాన్ని సాకుగా చూపుతూ ప్రయివేటీకరణ ద్వారా రూ.6లక్షల కోట్లుకుపైగా మొత్తాన్ని సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈనేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు తవ్వకాలు, ఖనిజాలు, రైల్వేలు..ఇలా వివిధ సంస్థల్లో ఆస్తులు, వనరుల అమ్మకం ద్వారా రూ.97వేల కోట్లు సేకరించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి పలు అంశాలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారికంగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షా 67వేలు కోట్లు సేకరించాలన్న లక్ష్యం సులభంగా సాధిస్తామని ఈ సమావేశంలో కేంద్రం ఆనందం వ్యక్తం చేసిందట!
కొన్నది ఎవరు?
కేంద్రం మీడియాకు విడుదల చేసిన సమాచారం ప్రకారం, వివిధ దేశాలకు చెందిన గ్లోబల్ పెన్షన్ ఫండ్స్ మన దేశంలోని ప్రభుత్వ ఆస్తుల్ని కైవసం చేసుకున్నాయి. కెనడా పెన్షన్ ప్లాన్, ఇన్వెస్ట్మేంట్ బోర్డ్, ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, క్యాపిటల్ గ్రూప్, యుటిలికో ఎమర్జింగ్ మార్కెట్స్ ట్రస్ట్..మొదలైనవి ఉన్నాయి. ఇవి టొరొంటో, లాసెంజెల్స్, లండన్..కేంద్రాలుగా పనిచేస్తున్నవి. స్థిరమైన లాభాలను ఆశించే మనదేశంలోని జాతీయ సంస్థల ఆస్తుల్ని, వనరుల్ని కొనుగోలు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో రేపు మంచి ధర వస్తే..తమ దగ్గరున్న ఆస్తిని అమ్మేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ బలహీనపడితే..ఆస్తి విలువను తగ్గించి అమ్మేస్తాయి. దాంతో మనదేశంలోని ప్రభుత్వ ఆస్తి, వనరుల విలువ అంతర్జాతీయ మార్కెట్‌తో ముడిపడుతుంది. ఇది దేశ ప్రయోజనాల్ని, భద్రతను తీవ్రంగా దెబ్బకొడుతుందని నిపుణులు చెబుతున్నారు.
దేశ భద్రతకే ముప్పు
ఎన్నో దశాబ్దాలుగా..ప్రజల సొమ్ముతో ఏర్పాటైన ప్రభుత్వ ఆస్తుల్ని, వనరుల్ని మోడీ సర్కార్ విదేశీయులకు అప్పజెబుతోంది. పెట్టుబడుల ఉపసంహరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ పలు చట్టాల్లో మార్పులు చేస్తోంది. ప్రభుత్వరంగంలోని అనేక పరిశ్రమలు ఇప్పటికే ప్రయివేటు, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీనిని మరింత వేగవంతం చేయడానికి మోడీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రైల్వేలు, రహదారులు, పట్టణీకరణ కింద ఎంతో విలువైన ప్రభుత్వ భూములు దాదాపు 40ఏండ్లపాటు ప్రయివేటుకు లీజ్‌కు ఇస్తున్నారు. సహజవాయువు, విద్యుత్, బొగ్గు తవ్వకాలు, ఖనిజాలు..ఇవన్నీ ప్రభుత్వం చేతులో ఉండకుండా..ప్రయివేటు, కార్పొరేట్ చేతికి చిక్కుతున్నాయి. దీనివల్ల దేశ భద్రత, సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేంట్లో ఎంతకు అమ్మారు?
బొగ్గు తవ్వకాలు - రూ.40వేల కోట్లు
రహదార్లు - రూ.23,853కోట్లు
ఖనిజాల తవ్వకం - రూ.18,705కోట్లు
విద్యుత్ - రూ.9,409కోట్లు
పౌర విమానయానం - రూ.1822కోట్లు
ఓడరేవులు, నౌకాయానం - రూ.975కోట్లు
పట్టణీకరణ - రూ.820కోట్లు
గోదాములు - రూ.814కోట్లు
రైల్వేలు - రూ.800కోట్లు