Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమాన్ జయంతి ర్యాలీలో హింస
- మోడీ మౌనంపై ప్రతిపక్షాల విమర్శ
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎటు చూసినా పోలీసులు,భద్రతా బలగాలు మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టారు. శనివారం హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. వ్యక్తులు కత్తులు దూస్తున్న ఘటనకు సంబంధించిన పలు వీడియోలు వైరల్‌గా మారాయి.వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో ర్యాలీపై దుండగులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఈ దాడిలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒక స్థానికుడు, ఎనిమిది మంది పోలీసులు ఉన్నారు. గాయపడిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మేధలాల్ మీనా కూడా ఉన్నారు. అతని చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో కాల్పులు జరిపిన అస్లాం కూడా ఉన్నాడు. నిందితుడి నుంచి ఒక కంట్రీమేడ్ పిస్తోల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఢిల్లీలో రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.ఆదివారం మరో ఆరుగురిని అరెస్టు చేశారు. కాగా ఈ అల్లర్లలో ఇద్దరు మైనర్లు ఉన్నట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియాలోని వీడియోల ద్వారా మరింతమంది అనుమానితులను గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఐపీసీ సెక్షన్లకింద కేసులు..
అల్లర్లు, దహనం, నేరపూరిత కుట్రకు సంబంధించిన వివిధ ఐపిసి సెక్షన్ల కింద జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు డీసీపీ (నార్త్‌వెస్ట్) ఉషా రంగనాని తెలిపారు. గాయాలు పాలైన వారిని సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందారని డీసీపీ తెలిపారు. శనివారం జరిగిన ఈ ఘటనపై పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అల్లర్ల కేసు దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.కాగా కర్నాటక, ఉత్తరాఖండ్ ,యూపీ తదితర రాష్ట్రాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి.
మోడీ మౌనం వీడండి
హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా చెలరేగిన ఘర్షణలపై ప్రధాని మోడీ మౌనం వహించడంపై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పించాయి. దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడాలంటూ.. 13 ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. అలాగే మతపరమైన హింసలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శనివారం సంతకాల సేకరణ ద్వారా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
దేశంలో జరుగుత్ను మతపరమైన ఉద్రిక్తతలపై ప్రధాని మౌనం వహించడం షాక్‌కు గురిచేసిందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో, చర్యలు తీసుకోవడంలో మోడీ విఫలమయ్యారని విమర్శించారు. 'ప్రధాని మౌనం.. ఇలాంటి ప్రయివేట్ సాయుధ గుంపులను అధికారికంగా ప్రోత్సాహించినట్లే అవుతుంది. వాళ్లు సంఘంలో విలాసాల్ని అనుభవిస్తున్నారనడానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా నిలిచింది' అని ప్రతిపక్షాలు ప్రకటనలో పేర్కొన్నాయి. ఇక సంతకం చేసిన పార్టీల్లో కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, జేఎంఎం, ఐయుఎంఎల్ ఇతర ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయి.
ముంబయిలో బీజేపీయేతర పార్టీల సీఎంల భేటీ..
భారతీయ జనతా పార్టీని రాజకీయంగా అడ్డుకోవడానికి ఏకం కావాలన్న ప్రతిపక్షాల ప్రయత్నాలకు ముందడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీయేతర ముఖ్యమంత్రులు త్వరలో భేటీ కానున్నారు. ఇందుకు ముంబయి వేదిక కానుంది.శివసేన ఎంపీ సంజరు రౌత్ ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు.బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుతూ గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలిసి చర్చించారనీ, ఇందులో భాగంగా ముంబయిలో ఈ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రౌత్ వివరించారు.నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతపరమైన అల్లర్లు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్టు రౌత్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన కొన్ని ఘటనలు రాజకీయ ప్రేరేపితమైనవిగా పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లోనే ఒక వర్గం ఓటర్ల ను సమీకరించేందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.