Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూహెచ్ఓ నమూనాపై భారత్ అభ్యంతరం
- కరోనా మరణాలపై ఆరోగ్య సంస్థ విధానాన్ని వర్తింపజేయలేం : కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ మరణాలను అంచనా వేయడానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రశ్నించింది. భౌగోళికంగా, జనభాపరంగా పెద్దదైన దేశంలో కరోనా మరణాలను అంచనా వేయడానికి ఇలాంటి గణిత నమూనాని వర్తింపజేయలేమని తెలిపింది. కరోనా మరణాలను వెల్లడించే విషయంలో డబ్ల్యూహెచ్ఓ ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటున్నదని 'న్యూయార్క్ టైమ్స్' ఒక కథనాన్ని వెలువరించింది. అయితే, దీనిపై భారత్ స్పందించింది. కరోనా మరణాలను అంచనావేసే విషయంలో ఉపయోగించే విధానాన్ని భారత్ పలు సందర్భాల్లో అభ్యంతరాలు తెలిపినట్టు కేంద్రం వివరించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాలను తప్పుబట్టడం లేదనీ, దానికి అవలంభించిన పద్ధతి పైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
మోడీ నిజాలు చెప్పరు.. చెప్పనివ్వరు : రాహుల్ గాంధీ
కోవిడ్ మరణాలను అంచనా వేసేందుకు డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటున్నదని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే 40 లక్షల మంది భారతీయులు కరోనాతో చనిపోయారని రాహుల్ ఆరోపించారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ నివేదిక స్క్రీన్‌షాట్‌ను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. '' ప్రధాని మోడీ నిజం మాట్లాడరు. ఇతరులను మాట్లాడనివ్వరు. ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదని ఇప్పటికీ అబద్దాలు చెప్తున్నారు'' అని హిందీలో ఆయన ట్వీట్ చేశారు.