Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీలకు లేని రక్షణ
- మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళనకరం
- ఈ విధానం దేశానికే ప్రమాదం : విశ్లేషకులు
న్యూఢిల్లీ : భారత్‌లో మోడీ పాలనలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది. బీజేపీ, దాని అనుబంధ హిందూత్వ సంస్థలు ఈ వర్గాలను టార్గెట్ చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి తీవ్రమైందని చెప్పారు. గత కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్రాలలో చెలరేగిన హింసను వారు ఉటంకించారు. మైనారిటీ ప్రాబల్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో కావాలనే యాత్రలు చేస్తూ వారిని రెచ్చగొట్టి హింసాత్మక ఘటనలను సృష్టించారని విశ్లేషకులు ఆరోపించారు.
తీవ్రవాదం పెరుగుదల
జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో హిందూత్వ కార్యకర్తలు పండుగ సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు చూస్తుండగానే వీధుల్లో పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వినడానికే అసహ్యమనిపించే కఠినమైన నినాదాలు చేశారు. ఆ వర్గం మహిళలపై లైంగికదాడి జరుతామని బజరంగ్ మునిగా ప్రసిద్ధి చెందిన హిందూత్వ నాయకుడు అనుపమ్ మిశ్రా హెచ్చరించారు. ఇందుకు ఆయన మద్దతుదారులు కేరింతలతో హౌరెత్తించారు. సాధ్వి సరస్వతి హిందువులను ఆయుధాలు చేతబట్టాలని పిలుపుని చ్చారు. ఒక వర్గం వారిని బహిరంగంగా ఉరితీయా లని డిమాండ్ చేశారు. దీపేంద్ర సింగ్ అకాయతి నర్సింహానంద్ మారణహౌమానికి పిలుపునివ్వడం గమనార్హం.గతవారం ఎనిమిది రాష్ట్రాలలో విస్తరించిన రామ నవమి అల్లర్లు, భారతదేశం అంతటా వ్యాపించిన విద్వేష రాజకీయాల భయాల ను విశ్లేషకులు నొక్కి చెప్పారు. మతపరమైన అల్లర్లు మోడీ హయాంలో పెరిగాయన్నారు. వీధి ముఠాలు, మత ప్రచారకులు, స్థానిక నాయకులు ఇలాంటి హింసను ప్రేరేపిస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలో వ్యాపారం చేయకుండా ముస్లిం దుకాణదారులపై నిషేధం, ఢిల్లీలో గోహత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి హత్య, కొట్టడం, బెదిరింపు లు.. ఇలాంటి హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం గణాంకాలను ఎందుకు నిర్వహించదని ప్రశ్నించారు.
కొత్తరకమైన జాతీయవాదం
ఉత్తర భారతం అంతటా విస్తరించిన గోరక్ష సంఘాలు, హిందూ యువ వాహిని, హిందూ జన జాగృతి సమితి, శ్రీరామ్ సేన, ఇతర గ్రూపులు వీధుల్లో హిందూత్వ రాజ్యాన్ని నిర్మిస్తున్నాయని విశ్లేషకులు వివరించారు. ఇందుకు జాతీయవాదం అనే అంశాన్ని తప్పుదారిలో ఉపయోగిస్తూ అమాయకులైన యువకులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నదనీ, దీని నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడటంలో భాగంగానే హిందూత్వ సంస్థలు అనవసర విషయాలను చర్చకు వచ్చేలా చేస్తున్నాయని చెప్పారు. ఆరెస్సెస్ ఆదేశాలను పాటిస్తూ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం చేస్తున్నదని విశ్లేషకులు ఆరోపించారు. ఇందుకు ఆరెస్సెస్ చీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. భారత్ వంటి ప్రజాస్వామ్య, లౌకిక దేశంలో ఇలాంటి ప్రయత్నాలు ఏ మాత్రమూ మంచిది కాదని సూచించారు.