Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 1,172 పాయింట్ల క్షీణత
- అధిక ధరల ఎఫెక్ట్.. ఐటీ షేర్లు ఢమాల్
న్యూఢిల్లీ : సామాన్యుడి నడ్డి విరిచేలా గతేడాది నుంచి దేశంలో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్యూపీఐ) వరుసగా 12వ నెలలోనూ రెండంకెల స్థాయిలో పెరిగింది. ప్రస్తుత ఏడాది మార్చిలో ఈ సూచీ ఏకంగా 14.55 శాతం ఎగిసి.. నాలుగు మాసాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనెల అధిక ధరలు ద్రవ్యోల్బణం ఎగిసిపడేలా చేస్తున్నాయి. సోమవారం కేంద్ర ప్రభుత్వ గణంకాల శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. ఇంతక్రితం 2021 నవంబర్లో ద్రవ్యోల్బణం అత్యధికంగా 14.87 శాతంగా చోటు చేసుకుంది. గడిచిన ఫిబ్రవరిలో 13.11 శాతంగా, గతేడాది ఇదే మార్చిలో 7.89 శాతంగా డబ్ల్యూపీఐ నమోదైంది. 2021 ఏప్రిల్ నుంచి ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది.
గడిచిన మార్చిలో ముడి చమురు, అహారేతర ఉత్పత్తులు, సహజ వాయువు, వంట నూనెలు, లోహాల ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయని ప్రభుత్వ గణంకాలు స్పష్టం చేశాయి. కాగా.. కూరగాయల ద్రవ్యోల్బణం 8.19 శాతం నుంచి 8.06 శాతానికి తగ్గింది. ముడి చమురు ధరలు 83.56 శాతం శాతం ఎగిశాయి. ఫిబ్రవరిలో చమురు ద్రవ్యోల్బణం 55.17 శాతంగా నమోదయ్యింది. అంతర్జాతీయ చమురు ధరలతో పోల్చితే భారత్లో రెట్టింపు పైగా పెరగడం ఆందోళనకరం. ఫిబ్రవరిలో తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 9.84 శాతంగా ఉండగా.. మార్చిలో 10.71 శాతానికి పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ వరుసగా మూడో మాసం మార్చిలోనూ పెరిగి 6.95 శాతానికి చేరింది. ఈ ద్రవ్యోల్బణాన్ని 6 శాతానికి కట్టడి చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోగా.. అంచనాలు మించి ఎగిసిపడుతోంది. దేశంలో ఆర్బీఐ అంచనాలకు భిన్నంగా ధరలు అమాంతం పెరగడంతో భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపునకు మెండుగా అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.