Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపుర్ ఖేరీ హింస కేసులో బెయిల్ రద్దు
- వారం రోజుల్లో లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశం
- అలహాబాద్ హైకోర్టు మళ్లీ కొత్తగా విచారణ చేపట్టాలి
- ఉత్తర్వులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: లఖింపుర్ ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. ఈ కేసులో సుప్రీం కోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రాకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసింది. ఆయన వారం రోజుల్లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. లఖింపుర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బాధిత రైతు కుటుంబాల సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం.. కొన్ని ప్రశ్నలు లేవనెత్తిం ది. కేసు విచారణ ప్రారంభం కాకముందే, పోస్టుమార్టం నివేదిక, గాయాల గురించి బెయిల్ ఉత్తర్వుల్లో హైకోర్టు ప్రస్తావించటాన్ని తప్పుపట్టింది. అసంబద్ధ విశ్లేషణలతో హైకోర్టు బెయిల్ ఇచ్చిందని అసహనం వ్యక్తం చేసింది. దీనిపై గతంలో తీర్పును రిజర్వ్ పెట్టిన న్యాయస్థానం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన బెట్టింది. ఆశిష్ కు బెయిల్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అతడు వారం రోజుల్లో జైలుకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో ఆశిష్ బెయిల్ దరఖాస్తుపై అలహాబాద్ హైకోర్టు మళ్లీ కొత్తగా విచారణ చేపట్టాలని సూచించింది. మిశ్రాకు బెయిల్ మంజూరు చేసే సమయంలో అలహాబాద్ హైకోర్టు న్యాయపరమైన పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది. ''ఎఫ్ఐఆర్ను సంఘటనల ఎన్సైక్లోపీడియాగా పరిగణించలేం. న్యాయపరమైన పూర్వాపరాలు విస్మరించబడ్డాయి'' అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతేడాది అక్టోబరులో లఖింపుర్ ఖేరీలో ఆందోళన చేస్తోన్న రైతులపైకి కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్ర కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ హింసాకాండకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కీలక నిందితుడు. దీనిపై గతంలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ దర్యాప్తును రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది. అక్టోబరు 9న ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరైంది. లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిరసన తెలిపిన రైతులను హత్య చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరుగుతోందని పేర్కొంది. అంతకుముందు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు సోమవారం తోసిపుచ్చింది.