Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో ఐదుగురు కార్మికులు మృతి
- ట్యాంక్‌లో ఊపిరి ఆడక
న్యూఢిల్లీ : కర్నాటకలోని మంగుళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగుళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఉల్కా ఎల్ఎల్పీ ఫిష్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో విషపు వాయువు లీక్ అయ్యింది. ఆదివారం రాత్రి జరిగిన దుర్ఘటనలో ఐదుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పొట్టకూటి కోసం బెంగాల్ నుంచి వలస వచ్చిన కార్మికులు విగతజీవులుగా మారడం అందర్నీ కలచివేస్తోంది. చేపల వ్యర్థాలను నిల్వచేసే ట్యాంక్‌ను శుభ్రపరుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ అవ్వడంతో ఊపిరాడక 8మంది ట్యాంక్‌లోనే స్పృహతప్పి పడిపోయారు. ఈ ట్యాంక్ 20 అడుగుల లోతు ఉంది. చేపల వ్యర్థాల ప్రాసెసింగ్ నుంచి గ్యాస్ లీకై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) హరి రామ్ శంకర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణమే ఫ్యాక్టరీలో పనులను నిలిపివేశారు. ఫ్యాక్టరీ ఇన్చార్జ్, ప్రొడక్షన్ మేనేజర్‌తోపాటు పలువురు బాధ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం బాగా పొద్దుపోయాక ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. మృతుల పేర్లు ఉమర్ ఫరూక్, సమి ఉల్లా ఇస్లాం, నిజాముద్దీన్ సాజ్, మిర్జుల్ ఇస్లాం, శరాఫత్ అలీగా పేర్కొన్నారు. ప్రాణాలతో బయటపడ్డవారికి ఓ ప్రయివేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.