Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల నుంచి 'హిందీ'పై అమిత్‌షాకు వ్యతిరేకత
- కేంద్రం తీరును తప్పుబడుతున్న మేధావులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ ప్రముఖులు
న్యూఢిల్లీ : దేశమంతా హిందీ భాషను తప్పనిసరి చేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుగాలి వీస్తున్నది. దీనిపై ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆయా రాష్ట్రాలు, అక్కడి మేధావులు, విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, కేంద్రం తీరును తప్పుబడుతున్నారు. మోడీ సర్కారు తీరు ఏ మాత్రమూ ఆమోదయోగ్యమూ కాదంటున్నారు.
హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను బలవంతంగా ప్రయోగించడంపై నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ఆందోళనలు ఈశాన్యన తీవ్రమయ్యాయి. నార్త్-ఈస్ట్ ఫోరమ్ ఫర్ ఇంటర్నేషనల్ సాలిడారిటీ (ఎన్ఈఎఫ్ఐఎస్) ఇతర సంస్థలతో కలిసి ''హిందీ అమలు''కు వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన ప్రదర్శనను చేపట్టింది. ఇందులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. పదోతరగతి వరకు హిందీని తప్పనిసరి చేయడానికి ఈశాన్య రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఎన్ఈఎఫ్ఐఎస్ ఖండించింది. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక భాషల కంటే కేంద్రం హిందీకే అధిక ప్రాధాన్యతనిస్తున్నదని వివరించింది. 2013లోనూ ఢిల్లీ యూనివర్సిటీ హిందీని తప్పనిసరి చేస్తూ ప్రతిపాదనను తీసుకొచ్చిందనీ, అయితే ఎన్ఈఎఫ్ఐఎస్ పోరాటంతో వెనక్కి తగ్గిందని పేర్కొన్నది.
ఈశాన్య విద్యార్థి సంఘాల చైర్పర్సన్ శామ్యూల్ బీ. జైర్వా కేంద్రం చర్యను తప్పుబట్టారు. హిందీ ఐచ్ఛికంగా ఉండొచ్చన్నారు. హిందీని తప్పనిసరి చేయకుండా తాము అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కలుస్తామని చెప్పారు. కేంద్రం చర్య ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేకమైనదని అసోంలోని కృశక్ ముక్తి సంగ్రామ్ సమితి తెలిపింది. మోడీ సర్కారు ప్రతిపాదనను ఖండించింది. మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ టీఎంసీ నాయకుడు ముకుల్ సంగ్మా కూడా కేంద్రం చర్యను విమర్శించారు. భాషను ప్రమోట్ చేయడానికి మరొక మార్గాన్ని అనుసరించాలని చెప్పారు.
ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి సైతం కేంద్రానికి షాక్ ఎదురువుతున్నది. తమిళనాడు ఆది నుంచీ హిందీ భాషను బలవంతంగా రుద్దడంపై వ్యతిరేకంగానే ఉన్నది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ లు హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని ప్రయోగించడంపై తమ అభ్యంతరాలను తెలిపారు. ఈ చర్య ఆమోదయోగ్యం కాదని విజయన్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీక అనీ, ఈ వైవిధ్యాన్ని గుర్తించకపోవడమే సంఫ్‌ుపరివార్ అజెండా అని తెలిపారు.