Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ ఎంపిక పరీక్షల్లో రూ. 210 కోట్ల స్కామ్
- దేవాలయాలకు ఇచ్చే నిధుల్లో 30 శాతం కమిషన్
బెంగళూరు: కర్నాటకలో బీజేపీ ప్రభుత్వ పాలనలో వరసగా ఒకదాని తరువాత ఒకటి కుంభకోణాలు భయటపడుతూనే ఉన్నాయి. మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమిషన్ డిమాండ్ చేసారని ఆరోపిస్తూ ఒక సివిల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంకా మర్చిపోక ముందే మరో రెండు కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ ఇన్స్పెక్టర్ల ఎంపిక కోసం నిర్వహించిన పరీక్షల్లో రూ. 210 కోట్ల కుంభకోణం జరిగింది. బీజేపీ మహిళా నాయకురాలు దివ్య హగర్గి ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు. ఈమె గుల్బర్గాలో ఒక హైస్కూల్‌ను నడుపుతోంది. ఎస్ఐ పరీక్షా కేంద్రం కూడా ఈ హైస్కూల్ ప్రాంగణంలోనే ఉంది. ఈ కేసును సీఐడీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. దివ్యతో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. దివ్య భర్త రాజేష్‌ను అరెస్టు చేశారు. అలాగే, బిజెపి పాలనలో మరొక కుంభకోణాన్ని బలేహోసూర్ స్వామి జై శ్రీ దింగా లంగేద్ర స్వామిజి వెలుగులోకి తెచ్చారు. స్వామిజి ఆరోపణల ప్రకారం ఏ మత మఠాలకైనా, దేవాలయాలకైనా ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో 30 శాతాన్ని బీజేపీ నాయకులకు చెల్లించాలి. మఠాలు, దేవాలయాల ఎంపికలోనూ వివక్ష ఉందని స్వామిజి ఆరోపించారు. ఈ ఆరోపణలు సాధారణ ప్రజలతో పాటు మత సంస్థలను కూడా దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కాగా, ఎప్పటి మాదిరిగానే ఈ కుంభకోణాలపై ముఖ్యమంత్రి బొమ్మై మౌనం వహిస్తున్నారు.