Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క రోజులో 90 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు పెరుగుతు న్నాయి. కొన్ని రోజుల నుంచి వేయి లోపు నమోదవుతున్న కేసులు ఒక్కసారిగా 2 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 1,033గా ఉన్న కేసులు సంఖ్య దాదాపుగా 90 శాతం పెరగడం విశేషం. 24 గంటల వ్యవధిలో 214 మంది కరోనాతో మృతి చెందారు. ఆదివారం 2.6 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో సోమవారానికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,00,000కు చేరుకున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,21,965కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,985 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,25,10,773కు చేరుకుంది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 11,542 క్రీయాశీల కేసులు ఉన్నాయి.
ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు
దేశరాజధాని ప్రాంతం(ఎన్సిఆర్), ఢిల్లీల్లో కొత్త కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతాల్లో గత 15 రోజుల్లోనే కోవిడ్ వ్యాప్తి 500 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఢిల్లీల్లో 24 గంటల్లో 517 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోల్చితే 12 శాతం అదనం. ఈ ఏడాది ఫిబ్రవరి 20 తరువాత ఇవే అత్యధిక కేసులు. ప్రస్తుతం ఢిల్లీలో 1,518 క్రీయాశీల కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 3 తరువాత ఇదే అత్యధికం. అయితే, మరోవైపు ఎన్సిఆర్, ఢిల్లీల్లో కేసులు పెరుగుతున్నా ఆస్పత్రిలో చేరేవారి రేటు తక్కువగానే ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.