Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ పోలీసుల పక్షపాత ధోరణి
- విచక్షణా రహితంగా అరెస్టులు
- జహంగీర్‌పురి ఘర్షణలపై వామపక్షాల నిజ నిర్ధారణ బృందం నిర్ధారణ
న్యూఢిల్లీ : ఢిల్లీలోని జహంగీర్‌పురి సి బ్లాక్‌లోని మతోన్మాద ఘర్షణలు చెలరేగిన ప్రాంతాల్లో ఆదివారం వామపక్షాలకు చెందిన నిజ నిర్ధారణ బృందం పర్యటించింది. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఫార్వర్డ్ బ్లాక్‌లకు చెందిన నేతలు, ఇరు కమ్యూనిటీలకు చెందిన బాధితులను, అక్కడి ప్రజలను కలుసుకుని వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 50కుటుంబాల వారితో ప్రతినిధుల బృందం మాట్లాడింది. అనంతరం ఆ ఏరియా అదనపు డీసీపీ కిషన్ కుమార్‌ను, ఇతర పోలీసు సిబ్బందిని కూడా కలుసుకుని మాట్లాడారు.
16వ తేదీన ఏం జరిగింది?
వాస్తవాలేమిటో తెలుసుకునేందుకు వెళ్ళిన బృంద సభ్యులకు అక్కడి వారి చెప్పినదేమంటే - హనుమాన్ జయంతి రోజున 150నుంచి 200మంది వరకు వున్న బృందం ఆయుధాలు చేబూని పెద్దగా డిజె మ్యూజిక్‌తో, నినాదాలు చేసుకుంటూ వీధుల్లో తిరుగుతూ వున్నారు. వారి చేతుల్లో పిస్టల్ళు, కత్తులు వున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయం వివిధ టీవీ చానెళ్ళలో చూపించిన వీడియోల ద్వారా కూడా నిర్ధారణ అయింది. పెద్ద పెద్దగా, చాలా దూకుడుగా నినాదాలు చేస్తూ వున్నారు. స్థానికులు నిర్వహించిన ప్రదర్శన కాదని, బజరంగ్ దళ్ యువజన విభాగం నిర్వహించిన ప్రదర్శన అని అక్కడి వారు చెప్పారు. వారిలో చాలామంది బయటివారే. ఆ ప్రదర్శనతో పాటు రెండు పోలీసు జీపులు కూడా వున్నాయి. ఒకటి ముందు భాగాన వుండగా, రెండోది చివర భాగాన కొనసాగింది. అయితే ఆ జీపుల్లో కేవలం ఇద్దరేసి మాత్రమే వున్నారు.
ఇక్కడ తలెత్తే మొదటి ప్రశ్న ఏమిటంటే - పోలీసులు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు ? ఆ ప్రదర్శనలో ఇలా బహిరంగంగా ఆయుధాలు చేబూనడానికి పోలీసులు ఎందుకు అనుమతినిచ్చారు. ?
జహంగీర్‌పుర్ సి బ్లాక్ ఏరియాలో అప్పటికే ఆ ప్రదర్శన రెండుసార్లు తిరిగింది. ఈ ఏరియాలో బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా వుంటారు. మూడో రౌండ్ జరుగుతున్నపుడు ఈ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. బిజెపి నేతలు చెబుతున్నట్లుగా ప్రదర్శనపై దాడి చేయాలని స్థానిక ముస్లిమ్‌లు కుట్ర పన్నినట్లైతే మొదటి రెండు రౌండ్లు సమయంలోనే దాడులు జరిగి వుండేవి కదా ! అలాకాకుండా, రోజాను దృష్టిలోవుంచుకుని మసీదు వద్దకు ప్రార్ధనల కోసం ముస్లిమ్‌లు వచ్చినపుడే సరిగ్గా మసీదు వెలుపల ప్రదర్శనను నిలుపుచేయడంతో ఈ సంఘటనలు జరిగాయన్నది వాస్తవం.
ఇక రెండో ప్రశ్న - మసీదు దగ్గరే ప్రదర్శనను నిలుపు చేయడానికి ఎందుకు అనుమతించారు?
మరో మాటలో చెప్పాలంటే, రోజా ముగిసే సమయంలో, ముస్లింలందరూ అక్కడకు చేరే వేళ సరిగ్గా మసీదు బయటకు ప్రదర్శన నిలుపుచేసేందుకు సాయుధ ప్రదర్శకులను అనుమతించారు. ఈ సంఘటనలను కుట్రగా అభివర్ణించినట్లైతే - ఇక్కడ కుట్రకు పోలీసులదే బాధ్యత. రెండు పక్షాల నుండి రాళ్ళు విసురుకోవడం జరిగిందని నిజ నిర్ధారణ బృందానికి చెప్పారు. ప్రదర్శకులు మసీదులోకి చొరబడతారని, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోరని ఆ ప్రాంత ప్రజల్లో ఒక రకమైన భయం నెలకొందని బృందానికి తెలియచేశారు. ఈలోగా పెద్దగా జనాలు మూగిపోయారు. మైనారిటీ కమ్యూనిటీలోని కొంతమంది ఆయుధాలు తీసుకువచ్చారని పేర్లు చెప్పడానికి ఇష్టపడని కొంతమంది తెలిపారు. ఊరేగింపుదారులు ఎక్కువ సంఖ్యలో వున్నారు. వారుఅక్కడ నుండి పారిపోయారు.
ఇక మూడో ప్రశ్న - ఇది పోలీసుల పక్షపాతంగా స్పష్టంగా కనిపించడం లేదా ? ఆ మొత్తం ప్రాంతంలో పోలీసుల విచారణ అంతా బిజెపి నేతల ప్రభావంతో ఏకపక్షంగా సాగుతోందని బృందానికి అర్ధమైంది. బిజెపి నేతలు బహిరంగంగానే పోలీసుల పాత్రను ప్రశంసిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు సాగించే ఏకపక్ష అరెస్టులు ప్రధానంగా మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారే అరెస్టు చేయడం అంతా స్పష్టంగా తెలుస్తోంది. పైగా ఊరేగింపుదారులు రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించడం, వారి దూకుడు చర్యలు ఇవన్నీ పూర్తిగా అన్యాయమే కాకుండా, దురుద్దేశపూరితమైనదిగా కూడా కనిపిస్తోంది. వారి చర్యలు వీడియోల ద్వారా కూడా స్పష్టమవుతున్నాయి.
నిర్ధారణ : మతోన్మాద ఘర్షణలను సృష్టించడానికి మతపరమైన సందర్భాలను, పండుగలను ఉపయోగించుకునేందుకు సంఘ పరివార్ అనుబంధ శక్తులు అమలు చేస్తున్న ఎజెండాలో భాగంగానే జహంగీర్‌పురి సంఘటనలు జరిగాయని నిజ నిర్ధారణ బృందం భావించింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. బీజేపీకి చెందిన దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్మేయర్ మాంసాహార పదార్ధాలపై నిషేధం ప్రకటించడం, జేఎన్‌యూలో శాఖాహారమే వండాలని ఏబీవీపీ పట్టుబట్టడం, వాటిని నిరసించిన వారిపై దాడులు జరపడం వంటివి అందుకు ఉదాహరణలుగా వున్నాయి. ఆ వరుస క్రమంలో భాగమే ఈ తాజా జహంగీర్‌పురి ఉదంతం. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఈ విచారణను అప్పగించడం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని నిజ నిర్ధారణ బృందం పేర్కొంది. నిర్దిష్ట కాలపరిమితితో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయి, దేశ రాజధానిలో మత సామరస్యతను దెబ్బతీయడానికి సంఘ పరివార్ శక్తులు చేస్తున్న ప్రయత్నాలు వెలికివస్తాయి.
వామపక్షాల విజ్ఞప్తి
ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ సమైక్యంగా వుండడమే ఈ విచ్ఛిన్నకర శక్తులకు ఇవ్వగల దీటైన సమాధానం. ఆర్ఎస్ఎస్-బీజేపీ ఎత్తుగడలు నెగ్గేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను విభజించేందుకు వారు ఇటువంటి మార్గాలను ఎంచుకుంటారు. ప్రజల జీవనోపాధులను, మతోన్మాదానికి వ్యతిరేకంగా సాగే ప్రజా పోరాటాలను పరిరక్షించుకునేందుకు సమైక్య ప్రజా ఉద్యమాలే మన ప్రత్యామ్నాయం. తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని ఢిల్లీ పోలీసుల పక్షపాతాన్ని ఎండగట్టేలా చర్యలు తీసుకోవాలని వామపక్షాలు హోం శాఖకు, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయి. ఈ విచ్ఛిన్నకర శక్తులపై తక్షణమే చర్య తీసుకోవాలని పోలీసులను కోరాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా వెంటనే ఇందులో జోక్యం చేసుకోవాలని కోరాయి. ఈ ప్రతినిధి బృందంలో సీపీఐ(ఎం) నేత రాజీవ్ కుమార్, సీపీఐ నేతలు వివేక్ శ్రీవాస్తవ, సంజీవ్రాణా, సీపీఎం(ఎంఎల్) కార్యదర్శి రవి రారు, ఫార్వర్డ్ బ్లాక్ నేత అమిత్ సహా జేఎంఎస్, డీవైఎఫ్ఐ, ఏఐసీసీటీయూ, ఏఐఎస్ఏ నేతలు వున్నారు.