Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రమంగా క్షీణిస్తున్న ప్రభుత్వ వైద్యం, విద్యా సేవలు
- ప్రయివేట్‌ను ఆశ్రయించటంతో సామాన్యుడి జేబుగుల్ల
- అప్పుల ఊబిలో మధ్యతరగతి
- బంగ్లాదేశ్, చైనాలో ఇలాంటి పరిస్థితి లేదు : ఆక్స్‌ఫాం ఇండియా నివేదిక
న్యూఢిల్లీ : కోవిడ్ సంక్షోభ సమయంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వలస కార్మికుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో దేశమంతా చూసింది. ఇదే సంక్షోభ సమయంలో భారత్‌లో శతకోటీశ్వర్ల సంఖ్య పెరిగింది. అత్యంత ధనికులు, కార్పొరేట్ల సంపద ఎన్నోరెట్లు పెరిగింది. మరోవైపు ..పేదరికంలో, నిరుద్యోగరేటులో భారత్ కొత్త రికార్డులు నమోదుచేసింది. ఇంతటి వైరుధ్యం, అసమానతలు దేశంలో నెలకొనడానికి కారణమేంటి? అన్న చర్చ సాగుతోంది. ఇదంతా ప్రయివేటీకరణ ఫలితమని 'ఆక్స్‌ఫాం' తాజా నివేదిక అభిప్రాయపడింది. 'ఇనీక్వాలిటీ కిల్స్ 2022' పేరుతో విడుదలైన నివేదికలో భారత్‌కు సంబంధించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు.
ప్రయివేటీకరణ విధానాలతోనే దేశం అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది..అంటూ మోడీ సర్కార్ బలంగా విశ్వసిస్తోంది. అందువల్లే అధికారంలోకి వచ్చింది మొదలు..ప్రభుత్వ వ్యయమంతా ప్రయివేటుకు తోడ్పడుతోంది. సంస్కరణల పేరుతో ప్రయివేటీకరణ వేగవంతమైంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, జాతీయ నగదీకరణ విధానం(ఎన్ఎంపీ)..పేరుతో బడా కార్పొరేట్ కంపెనీలకు ఎన్నో ప్రయోజనాలు అందజేశారు. ఫలితంగానే దేశంలో బడా కార్పొరేట్లు, అత్యంత ధనికుల సంపద పెరిగిందని నివేదికలో పరిశోధకలు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో ఒక డొల్లతనముందని, అందువల్లే నేడు ఈ ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
వైద్యం కోసం అష్టకష్టాలు..
భారతీయ కుటుంబాలు నేడు వైద్య సేవల కోసం చేస్తున్న మొత్తం ఖర్చులో 43శాతం ఔషధాలకు, 28శాతం ప్రయివేటు హాస్పిటల్స్‌కు వెళ్తోంది. పేదలు, మధ్య తరగతి..ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని కరోనా సంక్షోభం తీవ్రంగా దెబ్బకొట్టింది. ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేక..ప్రయివేటును ఆశ్రయించాల్సి వస్తోంది. మొత్తం వైద్యరంగాన్ని ప్రయివేటు హాస్పిటల్స్ నియంత్రిస్తున్నాయి. అవుట్ పేషెంట్ వైద్య సేవల్లో 74శాతం, ఇన్‌పేషెంట్ సేవల్లో 65శాతం ప్రయివేటు వాటాగా ఉంది. ప్రయివేటు హాస్పిటల్స్ వైద్య చికిత్సలపై, అవి వేసే బిల్లులపై మన పాలకులు ఎలాంటి నియంత్రణా విధించటం లేదు.
విద్యారంగంలోనూ అంతే..
ప్రయివేటు విద్యను ప్రోత్సహించడానికి జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) కేంద్రం తీసుకొచ్చింది. అందువల్లే స్కూల్ ఫీజులు చెల్లించలేక 35శాతం పిల్లలు పాఠశాలను మానేశారని ఒక నివేదిక తెలిపింది. అణగారిన వర్గాల్లో ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, బాలికలు విద్యకు దూరమయ్యారు. విద్యను మార్కెట్‌కు వదిలేయటం వల్ల సామాజికంగా నేడు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్రం నుంచి సామాజిక పథకాల భరోసా పోయింది. మొత్తం బడ్జెట్లో 0.6శాతం కేటాయింపులు ఏమూలకు సరిపోతాయి. దాంతో అనేక కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.
వైద్యంపై ప్రపంచ దేశాల సగటు వ్యయం 10శాతం ఉంటే, భారత్‌లో మాత్రం మొత్తం జీడీపీలో 1శాతం నిధుల వ్యయం కూడా లేదు. నేడు మనదేశంలో విద్య, వైద్య సేవలు, ఆహార భద్రత, ఇతర కనీస అవసరాలు అత్యంత ఖరీదు వ్యవహారంగా మారాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, చైనా దేశాల్లో పౌరులు ప్రభుత్వ వైద్య సేవలకు, పాఠశాలలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడ ప్రయివేట్‌లో కన్నా..ప్రభుత్వ విద్యాసంస్థల్లో, హాస్పిటల్స్‌లో మెరుగైన వసతులున్నాయి కాబట్టే ఆ పరిస్థితి నెలకొంది.